https://oktelugu.com/

BJP : కర్ణాటకలోనే కాదు, యూపీ, ఉత్తరాదిలోనూ బిజెపి ఓడింది.. దేశంలో ఇక గడ్డు రోజులేనా..?

కర్ణాటక ఎన్నికల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బిజెపికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి 192 నగర పంచాయతీలను మాత్రమే కైవసం చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2023 7:59 pm
    modi amith shaw

    modi amith shaw

    Follow us on

    BJP : భారతదేశంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ తరువాత నుంచి ఆ పార్టీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుని మరింత బలంగా తయారయింది బిజెపి. 2019 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకుంది. అయితే, కర్ణాటకలో తాజాగా వచ్చిన ఫలితాలు, యూపీ, ఉత్తరాది రాష్ట్రాల్లో వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశను కలిగిస్తున్నాయి. ఈ ఫలితాలతో బిజెపి పని అయిపోయిందని, రానున్నవి గడ్డు రోజులేనన్న విమర్శలు వస్తున్నాయి.

    దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ.. 2014లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందా అన్నంత రీతిలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరో ఏడాది మాత్రమే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్న తరుణంలో జరిగిన కర్ణాటక ఎన్నికలు ఆ పార్టీకి చావో.. రేవోగా మారాయి. అటువంటి పరిస్థితుల్లో సర్వశక్తులు ఒడ్డి ఘన విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ.

    కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదిన కర్ణాటక ఎన్నికలు..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో ఊపిరి ఊదినట్లు అయింది. ఈ ఎన్నికల్లో విజయం ఒకరకంగా చెప్పాలంటే గొప్ప ఓదార్పు గానే భావించాలి. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పార్టీలో కీలక పదవులు, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్న ఎంతోమంది క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారు. అసలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎంతో మంది ప్రశ్నించారు. అటువంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతటా పర్యటించి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం వెనుక రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఉందన్నది ఆ పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్న మాట. గత కొన్నేళ్లుగా ఎన్నికలను పరిశీలిస్తే ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. దీనికి ప్రధానమైన కారణం బిజెపి కాంగ్రెస్ పార్టీ పట్ల, మరియు ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రజల్లో బిజెపి పట్ల పెరిగిన వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి గొప్ప మెజారిటీని అందించి పెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో విజయం సాధించగా, బిజెపి 65 స్థానాలకు పరిమితమైంది. జెడిఎస్ మరో 19 స్థానాల్లో, ఇతరులు మరో నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.

    ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి పరాభవం..

    ఒక్క కర్ణాటక ఎన్నికల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బిజెపికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి 192 నగర పంచాయతీలను మాత్రమే కైవసం చేసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ 83 స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ 40 స్థానాల్లో, ఇతరులు 178 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా చూసుకుంటే నగర పంచాయతీల్లో 30 నుంచి 35 శాతం సీట్లలో మాత్రమే బిజెపి విజయం సాధించగా, ప్రతిపక్షాలు 70 నుంచి 75 శాతం స్థానాల్లో విజయం సాధించి బిజెపికి షాక్ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా బిజెపి 50 శాతం కంటే తక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజులు బిజెపికి ఇబ్బందికరంగానే మారనున్నట్లు చెబుతున్నారు.

    బిజెపికి గడ్డు పరిస్థితులు తప్పవా..?

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంపై ఉంటాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగిందని భావిస్తున్న తరుణంలో.. మరో రెండు మూడు నెలల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో బిజెపి కనీస స్థానాలు కూడా గెలుచుకోలేకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపి ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పదేళ్ల అధికారం తర్వాత ప్రజల్లో నెలకొన్న అసహనం, అసంతృప్తి ఓట్ల రూపంలో కర్ణాటక ఎన్నికల్లో ప్రస్ఫుటం అయింది. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తే మాత్రం బిజెపి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.