Bihar Election Result: రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే మొదలుపెట్టారు. ఓటర్ అధికార్ ర్యాలీ పేరుతో 25 జిల్లాల్లో పర్యటించారు. 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇన్ని చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అంతేకాదు సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితం అయిపోయింది. రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ ర్యాలీలో భారీగా జనం వచ్చినప్పటికీ.. ఆ జనాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయలేదు.
ఓటర్ అధికార్ ర్యాలీ కార్యక్రమానికి భారీగా జనం రావడంతో బీహార్ ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా సరే ఆర్ జె డి తో కలిసి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కలలు కన్నది. కానీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. పైగా రాహుల్ గాంధీ ఆశలు నిజం కాలేదు. బీహార్ లో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత పోస్టుమార్టం మొదలైంది. ఓటమికి కారణాలు ఏమై ఉంటాయనే విశ్లేషణ కూడా ప్రారంభమైంది.
ఎన్ డి ఏ ఈ స్థాయిలో భారీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీలకు, ఈ బీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. గతంలో ఎన్డీఏలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు.. వచ్చిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. గతంలో పనిచేసిన వారికి రిక్తహస్తం చూపించింది. దీంతో స్వపక్షంలోనే తిరుగుబాటు మొదలైంది. దీంతో అధిష్టానానికి వ్యతిరేకంగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారంతా పార్టీలో ఉంటూనే.. పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారు. ఇలా చాలా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది.