Atal Setu Bridge: రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. రవాణా సౌకర్యాలు బాగున్న చోటే అభివృద్ధి కేంద్రీకృతం అవుతూ ఉంటుంది.. సాధారణంగా రోడ్డు రవాణా అనేది మనదేశంలో చాలా అభివృద్ధి చెందింది. గడచిన పది సంవత్సరాలలో అది మరింతగా విస్తృతం అవుతూ ఉంది. వాయు రవాణాకు సంబంధించి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే జల రవాణా విషయంలోనూ మరింత అభివృద్ధి చెందేందుకు దేశం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే జల రవాణాపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాన నగరాలకు మధ్య అడ్డంగా ఉన్న జలాలపై వంతెనలు నిర్మిస్తోంది. అలా నిర్మించిందే అటల్ సేతు. ఈ బృహత్తర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. రవాణాకు సంబంధించి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి వంతెన నిర్మాణం చేపట్టారు.. ప్రధాని విజన్ లో భాగంగా దీనిని నిర్మించారు. ఇంతకీ దీని విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
అటల్ సేతు అనేది ఒక సముద్ర వంతెన. ఇది దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన. పట్టణ రవాణాను, మౌలిక సదుపాయాలను పెంచే క్రమంలో ఈ వంతెనను నిర్మించారు. ప్రజలకు రాకపోకలు అత్యంత సులభతరం చేసేందుకు ఈ వంతెనను నిర్మించారు. 2016 డిసెంబర్లో ఈ వంతెనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ₹17,840 కోట్ల వ్యయం తో ఈ వంతెన నిర్మించారు. ఇది 21.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది..ఆరు వరుసలుగా ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన ద్వారా ముంబై నుంచి నవీ ముంబై చేరుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ వంతెన నిర్మించక ముందు ముంబై నుంచి నవి ముంబై వెళ్లడానికి రెండు గంటల సమయం పట్టేది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రీ నుంచి ప్రారంభమవుతుంది. ఎలిఫెంట్ ఐలాండ్ కు ఉత్తరాన థానే క్రీక్ ను దాటి న్హావా సమీపంలో ఉన్న చిర్లే అనే గ్రామంలో ముగుస్తుంది . ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాల మధ్య వేగవంతమైన అనుసంధానం కోసం ఈ వంతెన దోహదం చేస్తుంది. పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ఈ వంతెన మీదుగా అత్యంత సులభతరంగా ప్రయాణం చేయవచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింగ్ ద్వారా నాలుగు చక్రాల వాహనాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈ వంతెన మీదుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. రోజుకు ఈ వంతెన మీదుగా 70 వేల వాహనాలు రాకపోకలు సాగించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. మోటార్ బైక్ లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లకు ఈ వంతెన మీద ప్రయాణం చేసే అవకాశం ఉండదు. ఈ ప్రాజెక్టు కారణంగా చాలామంది మత్స్యకారులు ఆవాసం కోల్పోయారు. వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది.
ముంబై, నవీ ముంబై మధ్య అన్ని వేల కోట్లు ఖర్చు చేసి కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మించడం వెనక అసలు కారణం వేరే ఉంది. ముంబై అనేది మన దేశ ఆర్థిక రాజధానిగా ఉంది. ఇది రోజురోజుకు మరింత పెరుగుతోంది. ముంబై మహా నగరాన్ని, నవీ ముంబై ని సముద్రం వేరు చేస్తున్నది. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు నవీ ముంబై లోనే ఉన్నాయి. ముంబై నుంచి ఆ ప్రాంతానికి వెళ్లాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. పైగా ట్రాఫిక్ కష్టాలు. ఈ క్రమంలో వాటి పరిష్కారానికి కేంద్రం ఈ వంతెన నిర్మించింది. ఈ వంతెన ఆధారంగా ప్రయాణానికి సంబంధించి సమయం తగ్గిపోవడమే కాకుండా.. సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ వంతెన నిర్మించింది. కేవలం ఈ వంతెన మాత్రమే కాకుండా మరో 30 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఇక ఈ అటల్ వంతెన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నది.
A new marvel of connectivity is set to be unveiled!
PM Shri @narendramodi will inaugurate the magnificent Atal Setu Mumbai Trans Harbour Link, a 21.8 km long bridge on sea, on 12 January 2024. pic.twitter.com/Fi0ZpEJkgh
— BJP (@BJP4India) January 9, 2024