https://oktelugu.com/

BJP : కర్నాటకం ఎఫెక్ట్.. పులిలాంటి బీజేపీ పిల్లి అయ్యింది…

అయితే ఇన్నాళ్లు తెలంగాణలో మిగతా పార్టీలను బీజేపీ పట్టించుకోలేదు. అదే మైనస్ గా మారుతోంది. ఒకవేళ టీడీపీ, జనసేనల సాయం తీసుకుంటే మాత్రం అందుకు బదులుగా ఏపీలో త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇలా ఎలా చూసినా కర్నాటక ఫలితాలు పులిలా ఉండే బీజేపీని పిల్లిలా మార్చాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.

Written By:
  • Dharma
  • , Updated On : May 19, 2023 7:32 pm
    Follow us on

    BJP : ఒక్క కర్నాటక ఫలితం దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలనే మార్చేసింది. ఓటమి అన్న నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. రాజకీయ యవనికపై కాంగ్రెస్ ను నిలబెట్టింది. జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థులతో పాటు మిత్రపక్షాలు, స్నేహం చేయాలనుకుంటున్న పార్టీలు వ్యూహాలు మార్చుకునేటంతగా కర్నాటక ఫలితం దిక్సూచిగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అన్నింటి కంటే మించి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు, అధికారంలో రావాలనుకుంటున్న బీజేపీకి కాంగ్రెస్ గట్టి సవాలే విసురుతోంది. కర్నాటక ప్రభావం తెలంగాణపై పడకుండా.. రెండు పార్టీలు ఇప్పుడు అలెర్టవుతున్నాయి.

    కర్నాటక ఫలితాలు ఏపీలో పొత్తులపై ప్రభావం చూపుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పొత్తుల కోసం వెంపర్లాడిన చంద్రబాబు సెడన్ గా సైలెంట్ అయ్యారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు సైతం బీజేపీ ప్రస్తావన మరిచిపోతున్నారు. తెలంగాణ ఎన్నికలు చూశాక పొత్తుల గురించి డిసైడవ్వాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటివరకూ టీడీపీతో పొత్తునకు వ్యతిరేకించిన బీజేపీ నాయకులు స్వరం తగ్గించుకున్నారు. మూడేళ్లుగా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీని కూడా కలుపుకుని వైసీపీపై పోరాటం చేద్దామని ప్రతిపాదిస్తుంటే పట్టించుకోలేదు. ఏకంగా ప్రధాని మోడీకి సైతం పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదన చెప్పినా ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం హైకమాండ్ చర్చిస్తోందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి గ్రౌండ్ లెవల్ లో బలం ఉంది. ఇది కాదనలేని నిజం. బీజేపీ అర్బన్ ప్రాంతాల్లో కొంత ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పటివరకూ నేతల చేరికతోనే ఆ పార్టీ బలం చూపించింది. క్షేత్రస్థాయిలో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ పొత్తులు అనివార్యం. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ వంటి పార్టీలు ఉన్నాయి. వాటన్నింటితో చెలిమి కడితేనే త్రిముఖ పోరులో బీజేపీ సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లు తెలంగాణలో మిగతా పార్టీలను బీజేపీ పట్టించుకోలేదు. అదే మైనస్ గా మారుతోంది. ఒకవేళ టీడీపీ, జనసేనల సాయం తీసుకుంటే మాత్రం అందుకు బదులుగా ఏపీలో త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇలా ఎలా చూసినా కర్నాటక ఫలితాలు పులిలా ఉండే బీజేపీని పిల్లిలా మార్చాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.