Aadhaar Free Update: ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువును కేంద్రం మరోమారు పెంచింది. గతంలో విధించిన గడువు మరో రెండు రోజుల్లో(మార్చి 14తో) ముగియనుంది. ఈ క్రమంలో గడువు మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. వచ్చే మూడు నెలలు కూడా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
పదేళ్లు పూర్తయినవారు..
ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఐడీఏఐ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ చేపట్టింది. 2023 జనవరి నుంచి ఈ అవకాశం కల్పించింది. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే చాలా వరకు అప్‌డేట్ చేసుకోకపోవడంతో క్రమంగా గడువు పెంచుతూ వస్తోంది. 2023 డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును మూడు నెలల క్రితం 2024, మార్చి 14 వరకు పెంచింది. రెండు రోజుల్లో ఈ గడువు కూడా ముగియనుంది. ఇప్పటికీ చాలా మంది అప్‌డేట్ చేసుకోలేదు. దీంతో మరోమారు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.
ఇవి అప్‌డేట్ చేసుకోవచ్చు..
ఆధార్ అప్‌డేట్‌లో భాగంగా చిరునామా, ఇతర వివరాలతోపాటు ఫొటోను సొంతంగా అధికారిక ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పదేళ్లలో ఒక్కసారైనా చిరునామా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది.
పెరిగిన వినియోగం..
ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలకు ఆధార్ వినియోగం తప్పనిసరి అయిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ అప్‌డేట్‌కు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో.. ఆధార్‌కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందడానికి యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఆన్‌లైన్‌లో సొంతంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునేవారికి ఎలాంటి పీజు లేకుండా చేసుకునే అవకాశం కల్పించింది.
గడువు పెంపు ఇలా..
మొదట 2023 ఫిబ్రవరి వరకే ఉచిత అప్‌డేట్ సేవలని యూఐడీఏఐ ప్రకటించింది. తర్వాత ఆ గడువును అదే ఏడాది మూడు దఫాలుగా పెంచింది. తర్వాత 2024 మార్చి 14 వరకు ఛాన్స్ ఇచ్చింది. తాజాగా ఆ గడువును కూడా 2024, జూనల్ 14 వరకు పెంచుతూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు.