Padma Awards 2024: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది అవార్డులు వచ్చాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ కు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. ఇక తెలంగాణకు ఏకంగా ఐదు పద్మశ్రీలు దక్కాయి. బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కళా విభాగంలో వేలు ఆనందాచారి, విద్య, సాహిత్య రంగాల్లో కేతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్య ఉన్నారు.
అయితే ఈసారి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరికి పద్మశ్రీలు రావడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ సోమ్లాల్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. గతంలో అదే గ్రామానికి చెందిన రావి నారాయణరెడ్డి కి సైతం పద్మశ్రీ దక్కడం విశేషం. దీంతో ఒకే గ్రామానికి చెందిన వారికి రెండు పద్మ అవార్డులు రావడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది.
అయితే ఈసారి పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారికి పద్మ అవార్డులు లభించడం విశేషం. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారు.. వారి నైపుణ్యం, ప్రతిభకు తగ్గ గుర్తింపు రాని వారిని సైతం పద్మ అవార్డులు వరించడం విశేషం. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించినట్లు తెలుస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా 137 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అయితే ఇందులో కొందరికి మరణం తరువాత అరుదైన గౌరవం దక్కడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేయడం.. ఐదు పద్మ విభూషణ్ పురస్కారాలకు గాను.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి ఎంపిక చేయడం గమనార్హం. మార్చి, ఏప్రిల్ నెలలో పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పద్మ అవార్డుల్లో సరైన గుర్తింపు లభించడం పై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.