
సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ నాలుకను పరిశీలించి ఆరోగ్య సమస్య చెప్పేస్తాడు. నాలుకను చూస్తే ఏం తెలుస్తుందని మనలో చాలామంది భావించినా డాక్టర్లు నాలుకను బట్టి మనిషి ఆరోగ్యాన్ని సులభంగా అంచనా వేయగలరు. నాలుక మృదువుగా, తేమతో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అలా కాకుండా వేరేలా ఉంటే మాత్రం నాలుక కొన్ని ఆరోగ్య సమస్యలను చూపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.
నాలుకపై తెల్లటి పూత ఉంటే నోటిలో ఫంగస్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఫంగస్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు శరీరం బలహీనపడే అవకాశాలు ఉంటాయి. నాలుకపై మందపాటి తెలుపు, లేదా బుడిద రంగు పాచెస్ ఉంటే నోటి క్యాన్సర్ లేదా ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితే లైకెన్ ప్లానస్ కు కారణమవుతుంది.
లైకెన్ ప్లానస్ శరీరంలోని శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. లైకెన్ ప్లానస్ వల్ల నాలుక దెబ్బతినడంతో పాటు నాలుకపై తెల్లని మచ్చలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. నాలుక మరీ ఎర్రగా ఉంటే పొషకాహార లోపం అని భావించాలి. బీ 12 విటమిన్ లోపం వల్ల నాలుక ఎర్రగా కనిపించే అవకాశం ఉండగా విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.
నాలుకపై మ్యాప్ లాంటి నమూనాలు ఉంటే మధుమేహం, అలెర్జీలు, లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. పిల్లల్లో జ్వరం, రక్తనాళాల వాపు వల్ల నాలుక ఎర్రగా కనిపిస్తుంది. నాలుకకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.