ఆమె 9నెలలు నిండిన నిండు గర్భిణీ, ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో తెలియదు. తెల్లవారేసరికి గర్భం మాయమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్లు, నర్సులు, గ్రామస్థులు ఆశ్చర్యానికి గురువుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండలంలో పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన మానస మంజుల (25)కు ఆరేళ్ల క్రితం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ తో వివాహం జరిగింది. కానీ అప్పటి నుండి ఆమె గర్భం దాల్చలేదు. గత ఏడాది గర్భం నిలబడడంతో ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయముతో మానోపాడు పిహెచ్‌సిలో పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె 9 నెలల నిండు గర్భిణి. ఈ క్రమంలో శనివారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి PHCకి వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో తనను ఇంటికే తీసుకెళ్ళలని కోరింది. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికే తీసుకెళ్లారు. ఆ రాత్రి ఆమె పడుకొని ఆదివారం ఉదయం లేచే సరికి ఆమె గర్భం మాయమైంది. ఇదే విషయాన్ని ఆమెను అడగగా దేవుడొచ్చి తీసుకెళ్లాడని చెబుతుంది.
మంజులను చూసి డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్ తిన్నారు. ముందు రోజు రాత్రి ఆమెకు గర్భం ఉన్నదని.. కానీ ఇప్పుడు కనబడడం లేదని ఏఎన్ఎం, ఆశా వర్కలు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలియడంతో డాక్టర్ దివ్య ఆస్పత్రికి చేరుకొని ఆమెను పరిశీలించారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలను తాను చేశానని.. కానీ ఇప్పుడు కడుపు కనిపించడం లేదని చెప్పారు. ఆమె డెలివరీ అయ్యినట్లు, అబార్షన్ చేయించుకున్నట్లు కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని తెలిపారు.
స్కానింగ్ చేస్తే తప్ప అసలు ఏం జరిగిందో తెలియదని డాక్టర్ చెప్పారు. ఐతే దేవుడు ఆవహించాడనే విషయం అవాస్తవమని.. స్కానింగ్ రిపోర్టును బట్టి నిజాలు తెలుస్తాయని తెలిపారు. మరోవైపు ఆమె నిండు కడుపుతో ఉన్న మాట వాస్తమని.. మా కళ్లతో మేము చూశామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. అసలు గర్భం ఎలా మాయమైందో అర్ధం కావడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు, భర్త కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది.