ఉత్తర ప్రదేశ్ లో ఓ యువతిపై అత్యాచారం జరగడంతో దానికి సంబంధించిన ఆందోళనను కవర్ చేసిన ఓ జర్నలిస్టుకు ఐదు నెలల పాటు జైలు శిక్ష.. ఇటీవల ఢిల్లీ రైతుల నిరసన హింసగా మారిన వార్తను కవర్ చేసిన 8 మంది జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు.. ఈ నిరసనలో ఓ వ్యక్తి మరణించాడని చెప్పినందుకు ఐదు రాష్ట్రాల్లో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులపై కేసుల నమోదు.. వీరిలో ఒకరు అరెస్టు.. ఇలా దేశవ్యాప్తంగా జర్నిలిజంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో భావస్వేచ్చ ప్రకటనకు భంగం వాటిల్లిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయన్ని ప్రజలకు అందించేందుకు ప్రతీ జర్నలిస్టు తన ప్రాణాలను కూడా ఫణంగా పెడుతుంటారు. జరిగిన విషయాన్ని జరిగినట్లు.. ఉన్నది ఉన్నట్లు తనకుండే మార్గాల ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తాడు.. అలా చెప్పడమేనేరమా..? ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా..? అంటూ దేశ మీడియా ఆందోళన చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనతో మీడియా రంగం ప్రమాదంలో పడినట్లు కొందరు సీనియర్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ అనే సంస్థ ప్రతీ ఏటా భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మీడియా ర్యాంకు దిగజారింది. ఇది రైతుల ఆందోళన సందర్భంగానే చెప్పక తప్పదంటున్నారు సంస్థ ప్రతినిధులు.
రైతు నిరసనల్లో భాగంగా జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ సంఘటనలో ఓ రైతు మరణించాడు. ఆ రైతు ట్రాక్టర్ తిరగబడడంతో చనిపోయాడని చెబుతున్నా.. పోలీసుల కాల్పులతోనేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వార్తలను ప్రచురించిన ‘ది వైర్’ అనే పత్రికలో పనిచేసే జర్నలిస్టుపై కేసు నమోదైంది. ఇక దీనినే విశ్లేషిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలా సోషల్ మీడియాలో వార్తను పెట్టిన ఆరుగురు జర్నలిస్టులతో పాటు ఓ కాంగ్రెస్ ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. అయితే పాత్రికేయులపై కేసులు పెట్టడం భావస్వేచ్ఛ ప్రకటనకు భంగపరిచినట్లేనని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా‘ ఆరోపించింది.
మరోవైపు పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం దాడులు చేస్తోందన్న వాదనను అధికార పార్టీ బీజేపీ కొట్టిపారేసింది. ‘కొందరు వార్తలు రాసే జర్నలిస్టులు వివిధ పార్టీలతో సంబంధాలు ఏర్పరుచుకొని అసత్య సమాచారాన్ని ప్రచురిస్తున్నారని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా అంటున్నారు. నిరసనకారులను కొందరు జర్నిలిస్టులు తమ వార్తల ద్వారా మరింత రెచ్చగొట్టారని, అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
తప్పుడు సమాచారం ప్రచారం చేసిన ఓ టీవీ సీనియర్ ఎడిటర్ ను యాజమాన్యం వార్తలు చెప్పనీయలేదు. గతంలో ఓ అసత్యవార్తను చెప్పడంతో అది వివాదం అయింది.. దీంతో ఆ ఎడిటర్ బాధితులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇలాంటి వారితో జర్నలిజానికి ప్రమాదం ఏర్పడుతుంది.. అందుకే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బైజయంత్ పాండా ఆయన చెప్పారు.
అయితే ప్రజా సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులపై దేశద్రోహం లాంటి కేసులు పెట్టడమేంటని కొందరు వాదిస్తున్నారు. గత దశాబ్దం కాలంగా నమోదైన 405 లాంటి సెక్షన్ల కేసులు మోదీ అధికారంలోకి వచ్చాకే నమోదవుతున్నాయని జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు. ఈ సెక్షన్లకు జర్నలిస్టులే కాకుండా విద్యార్థులు, రచయితలు, మేధావులు కూడా బలవుతున్నారనేది బలమైన వాదన. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఇండియాకు పెద్ద మనసు ఉంటుందంటారు. అలాంటి భారతదేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ వార్తలు రాయలేకపోవడం దారుణ విషయమని కొందరు ఆవేదన చెందుతున్నారు.