https://oktelugu.com/

రైతుల విషయంలో మోడీ ఓడిపోతాడా?

ఏ సర్కార్ వచ్చినా రైతులకు ఏమున్నది గర్వకారణం అన్నట్టుగానే వ్యవస్థ పాడైంది.. రైతులు కష్టపడి పంట పండించడం.. దానికి మద్దతు ధర లేక.. గిట్టుబాటు కాక.. వర్షానికి పంట తడిచి గిలాగిలా కొట్టుకోవడం తెలిసిందే.  రైతులు రకరకాల బాధలు పడుతూ ప్రతి ఏడూ కాలంతో పరిగెడుతుంటారు. వారికి మేలు చేయకపోగా.. సర్కార్లు వారికి హానీ చేకూర్చే చట్టాలు తెస్తే ఏమవుతుంది? ఢిల్లీలో రైతుల ఆందోళనలా మారుతుంది. మోడీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టాలా ఉన్నాయన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 10:40 AM IST
    Follow us on

    ఏ సర్కార్ వచ్చినా రైతులకు ఏమున్నది గర్వకారణం అన్నట్టుగానే వ్యవస్థ పాడైంది.. రైతులు కష్టపడి పంట పండించడం.. దానికి మద్దతు ధర లేక.. గిట్టుబాటు కాక.. వర్షానికి పంట తడిచి గిలాగిలా కొట్టుకోవడం తెలిసిందే.  రైతులు రకరకాల బాధలు పడుతూ ప్రతి ఏడూ కాలంతో పరిగెడుతుంటారు. వారికి మేలు చేయకపోగా.. సర్కార్లు వారికి హానీ చేకూర్చే చట్టాలు తెస్తే ఏమవుతుంది? ఢిల్లీలో రైతుల ఆందోళనలా మారుతుంది.

    మోడీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టాలా ఉన్నాయన్న రైతుల ఆందోళనలు, భయాలు తొలిగిపోవడం లేదు. బీజేపీ ఎంత సర్ధిచెప్పినా వర్కవుట్ కావడం లేదు. రైతులంతా ఇప్పుడు మోడీ సర్కార్ పై దండెత్తారు. మోడీ నామస్మరణతో దేశమంతా మారుమోగుతున్న వేళ ఇప్పుడు ఆయన కంట్లో నలుసులా రైతుల ఆందోళన బీజేపీ పరువుతీస్తోంది.

    పార్లమెంట్ లో పూర్తి బలం ఉండడంతో మోడీ ఏం చేస్తే అదే పాటించాలన్నట్టుగా నిన్నటిదాకా ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఉత్సవ విగ్రహంలా మారిన వేళ ప్రశ్నించే గొంతుకే కరువైంది. కానీ పార్టీలు మిన్నకున్నా రైతులు మాత్రం పోరుబాటు పట్టారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు.

    మోడీ వచ్చాక దేశంలో ప్రైవేటీకరణ పెరిగి.. ప్రభుత్వ సంస్థలు కుదేలై ప్రైవేటు పరం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేట్లే దేశాన్ని శాసిస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ చట్టాలతో ఆ భయం రైతుల్లో ఎక్కువైంది.

    మోడీ భక్తులు మాత్రం రైతుల ఆందోళనను పెయిడ్ ఆర్టిస్టులతో పోలుస్తూ వారిని నిరసనను అవమానిస్తున్నారు. గడ్డకట్ట చలిలో తిండి తిప్పలు, నిద్ర మానేసేంత కసి పైసలు ఇస్తే రాదనే సంగతి వారికి తెలియడం లేదు.

    ఎన్ని విమర్శలొచ్చినా.. ఎవ్వరూ సహకరించకున్నా రైతులు పట్టువీడడం లేదు. వారి డిమాండ్ ను నెరవేర్చడం తప్ప మోడీకి మరో దారి కనిపించడం లేదు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటే మోడీకి అవమానం.. తీసుకోకపోతే దేశమంతా మోడీకి సెగతప్పదు. ఇప్పుడు మోడీ సార్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే వెనక్కితగ్గడం తప్ప మోడీకి మరో ఆప్షన్ లేకుండా పోయింది.