‘తిండికి ముందుండాలి.. దెబ్బలకు వెనకుండాలి’ అని ఒక సామెత. దీన్ని టాలీవుడ్ అగ్రహీరోలు అద్భుతంగా ఫాలో అయిపోతున్నట్టున్నారు. రెమ్యునరేషన్ పేరుతో కోట్లకు కోట్లు తీసుకుంటారు. మరికొందరు లాభాల్లో వాటాలు కూడా పోగేసుకుంటారు. కానీ.. సమస్య వచ్చినప్పుడు మాత్రం కనిపించకుండా పోతారు. తాజాగా.. వకీల్ సాబ్ సినిమా సందర్భంగా తలెత్తిన అంశమే ఇందుకు ఉదాహరణ.
‘వకీల్ సాబ్’ విడుదలకు ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను తెచ్చింది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా తెచ్చిందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ఈ జీవో ప్రకారం.. మల్టీఫ్లెక్స్ లలో, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రీమియం టికెట్ ధర రూ.250 మాత్రమే ఉండాలి. మిగిలిన టిక్కెట్లు రూ.150, 100 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లలో ఏసీ ఉంటే వంద, లేదంటే రూ.60 మాత్రమే ఉండాని ఆదేశాలు జారీచేసింది. ఇవన్నీ దాదాపు పదేళ్ల కిందటి ధరలు. ఈ ధరలతో సినిమా నడిపిస్తే ఎవరికి నష్టం అన్నది పాయింటు.
సినిమా విడుదలకు ముందే.. హీరోలకు రావాల్సిన కోట్లన్నీ ముట్టేస్తాయి. కాబట్టి.. సరిగ్గా చెప్పుకోవాలంటే అది ఆడినా.. ఆడకపోయినా వారికి సంబంధం లేదు. ఇక, నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుగానే చెల్లించి ఉంటారు. వీరి నుంచి సినిమాను తీసుకునేవారు ఎగ్జిబిటర్లు. అంటే.. సినిమా ఆడించే థియేటర్ ఓనర్లు. వీళ్లు రాబడి ఎలా ఉంటుందంటే.. పర్సంటేజ్ వారిగా ఉంటుంది. అంటే.. వంద రూపాయలు వస్తే.. అందులో మాట్లాడుకున్న దాన్నిబట్టి 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటారు.
కరోనా తర్వాత ఇండియాలోనే విడుదలైన పెద్ద చిత్రం వకీల్ సాబ్. దీంతో.. తమ థియేటర్లోనే ఆడించడానికి చాలా మంది ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్సులు కట్టి మరీ సినిమాను తెచ్చుకున్నారు. తీరా విడుదల చేయడానికి ఒక్క రోజు ముందు రేట్లు ఇంతే ఉండాలని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వారి గుండెల్లో బండ పడ్డంత పనైంది. అది లెక్కల్లో కూడా కనిపించింది.
ఏపీలోని ఓ జిల్లాలో మొదటి రోజు రూ. 3కోట్లు కలెక్షన్ వస్తుందని అంచనా వేస్తే.. తగ్గిన రేట్ల కారణంగా కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చింది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఏకంగా జీవోనే తేవడంతో.. ఇది వకీల్ సాబ్ తోనే పోయేది కాదని తేలిపోయింది. మరి, ఇదే పరిస్థితి కొనసాగితే.. తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు ఎగ్జిబిటర్లు.
థియేటర్లలో గతంలో మాదిరిగా నెగిటివ్ ప్రొజెక్టర్ తో సినిమా నడిపే రోజులు కావు. డిజిటల్ యుగంలో అన్నీ మారిపోయాయి. దీంతో.. కోట్లు ఖర్చు పెట్టి వీరుకూడా మార్చేసుకున్నారు. మరి, పదేళ్ల క్రితం నాటి ధరలతో థియేటర్ నిర్వహణను ఎలా నడపాలని ఆందోళన చెందుతున్నారు.
ఇంత జరుగుతున్నా.. పెద్ద హీరోలుగా ఉన్నవారు కనీసం మాట కూడా మాట్లాడట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వంతో ఎందుకొచ్చిన పంచాయితీ అని ఎవరికి వారు మిన్నకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ మాట్లాడకపోవడమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయినా.. ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మరి, ఈ వ్యవహారం ఎందాక పోతుందో..? ఎటువైపు మళ్లుతుందో చూడాల్సి ఉంది.