
Shikhar Dhawan : ఇవాళ సోషల్ మీడియాలో భారీగా ట్రెండింగ్ అవుతున్న పేరు శిఖర్ ధావన్. టీమిండియా డాషింగ్ ఓపెనర్ దంపతులు విడిపోయారన్న వార్త వైరల్ అవుతోంది. తాము విడాకులు తీసుకున్నామంటూ.. ధావన్ భార్య అయేషా ముఖర్జీ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయేషా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు, ధావన్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఏం జరిగిందీ? విడాకులకు కారణాలేంటీ? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే.. శిఖర్ ధావన్ పెట్టిన లేటెస్ట్ పోస్టును చూసినవారు.. ఆన్సర్ అదేనని చెబుతున్నారు.
ధావన్ – అయేషాది ప్రేమ వివాహం. అయేషా తండ్రి ఇండియన్ కాగా.. తల్లి బ్రిటన్ వాసి. వీరికుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది. అక్కడే పెరిగిన అయేషా ముఖర్జీ.. ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ గా ఎదిగింది. అనంతరం అక్కడే ఓ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ ను పెళ్లాడింది. అయితే.. వీరిద్దరి కలయిక విచిత్రంగా జరిగింది.
అయేషా ముఖర్జీ.. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫేస్ బుక్ ఫ్రెండ్. ఓ సారి భజ్జీ వాల్ లో అయేషా ఫొటోను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు ధావన్. ఆ తర్వాత కొంతకాలం ఆమెతో చాట్ చేసిన గబ్బర్.. ఆమె గత జీవితాన్ని కూడా తెలుసుకొని, పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ.. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికీ.. ఆమె కోసం ఇంట్లో గొడవపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా.. 2012లో వీరు ఒక్కటయ్యారు.
2014లో వీరికి ఒక బాబు జన్మించాడు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి తాము విడిపోతున్నట్టు ఆయేషా ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు చేసింది. ‘‘మొదటి సారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో విఫలమైనట్టు, తప్పు చేస్తున్నట్టు భావించాను. నా తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్టు భావించాను. ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోవాల్సి రావడం అనేది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఈ సమయంలో నన్ను నేను మళ్లీ నిరూపించుకోవాల్సి ఉంది.’’ అని పోస్టు చేసింది అయేషా.
ఈ నేపథ్యంలో గబ్బర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘‘మీ కల నెరేవర్చుకోవడానికి మీరు ఎంతో కష్టపడాలి. మనం చేసే పనిపై ప్రేమ ఉండాలి. అప్పుడే.. అసలైన ఎంజాయ్ తెలుస్తుంది. మీ కలలు సాకారం కావాలంటే కష్టపడండి’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు ధావన్. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ గా మారింది.
అంటే.. వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలు.. గబ్బర్ కెరీర్ ను ఇబ్బంది పెట్టాయా? తన క్రీడా జీవితంపై పూర్తిగా దృష్టి సారించేందుకే విడాకులు తీసుకుంటున్నాడా? అనే చర్చ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే నిజమైతే.. రాబోయే రోజుల్లో క్రికెట్ మైదానంలో అసలైన ధవన్ ను చూస్తారని అంటున్నారు.