https://oktelugu.com/

ఆంధ్రలో ఎన్ని జిల్లాలు వుండాలి?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా జిల్లాల సంఖ్యను పెంచటానికి సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని వాటి సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది. అదేసమయంలో ఈ పెంపుదల 25 పార్లమెంటు నియోజక వర్గాల ప్రాతిపదికగా ఉంటుందని కూడా చెప్పింది. అరకు నియోజక వర్గాన్ని మాత్రం రెండుగా విభజించే విధంగా పరిశీలించమని కోరటం జరిగింది. అధ్యయన కమిటీ పరిశీలన పూర్తి స్థాయి పరిశీలనా లేక కేవలం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికనా అనేది టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ చూస్తేగానీ […]

Written By:
  • Ram
  • , Updated On : July 17, 2020 / 02:54 AM IST
    Follow us on

     

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా జిల్లాల సంఖ్యను పెంచటానికి సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని వాటి సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది. అదేసమయంలో ఈ పెంపుదల 25 పార్లమెంటు నియోజక వర్గాల ప్రాతిపదికగా ఉంటుందని కూడా చెప్పింది. అరకు నియోజక వర్గాన్ని మాత్రం రెండుగా విభజించే విధంగా పరిశీలించమని కోరటం జరిగింది. అధ్యయన కమిటీ పరిశీలన పూర్తి స్థాయి పరిశీలనా లేక కేవలం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికనా అనేది టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ చూస్తేగానీ తెలియదు. ఎటూ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తికావటానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి సమగ్ర అధ్యయనమే మేలవుతుంది. ముందే కమిటీ చేతులు కట్టేస్తే అక్కడ చేయటానికి ఏమీ వుండదు. అసలు ఈ పెంపుదల సబబా కాదా అనేది ఒక్కసారి పరిశీలిద్దాం.

    దేశంలో జిల్లాల స్వరూపం ఎలా వుంది?

    నిజంచెప్పాలంటే దీనికి ఒక ప్రాతిపదిక, మార్గదర్శకాలు లేవు. ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్దతి. అన్నింటికన్నా ఎక్కువ జిల్లాలు సహజంగానే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోనే వున్నాయి. అయితే అక్కడ పేరుకు 75 జిల్లాలు వున్నా ఇప్పటికీ జిల్లాకు సగటు జనాభా చూసుకుంటే 26 లక్షలకు పైనే వుంది. జాతీయ సగటు 16 లక్షల 77 వేలు మాత్రమే. మొత్తం దేశంలో 729 జిల్లాలు వున్నాయి. అన్నింటికన్నా ఎక్కువ సగటు జనాభా పశ్చిమ బెంగాల్ లో వుంది. అక్కడ ఒక జిల్లాకు సగటున షుమారు 40 లక్షల జనాభాతో 23 జిల్లాలు వున్నాయి. ఆ తర్వాత రెండో అత్యధిక సగటు జనాభా ఆంధ్రప్రదేశ్ లోనే వుంది. షుమారు 38 లక్షల సగటు జనాభాతో 13 జిల్లాలు వున్నాయి. అదే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో అయితే షుమారు 11 లక్షల సగటు జనాభాతో 33 జిల్లాలు వున్నాయి. ఈశాన్య భారతం, జమ్మూ-కాశ్మీర్, ఆదివాసి ఆధిపత్య రాష్ట్రాలు మినహాయిస్తే ఇంత తక్కువ సగటు ఏ రాష్ట్రంలో లేదు. మైదాన ప్రాంతాల్లో ఇంత తక్కువ సగటుతో వికేంద్రీకరణ మొదటికే మోస మొస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 33 జిల్లాల నిర్వహణ వ్యయం తడిచి మోపెడయ్యి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడే అవకాశం వుందని , ఈ సంఖ్య 20 కి అటూ ఇటుగా వుండి  వుంటే బాగుండేదని  పరిపాలనా నిపుణుల అభిప్రాయం. అసలు దీనిపై కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చివుంటే బాగుండేది.

    దేశంలో ఇలా ఓ పద్దతి లేకుండా వున్నవి చాలా వున్నాయి. ఉదాహరణకు చాలా రాష్ట్రాల్లో జిల్లాల పైన డివిజన్లు వున్నాయి. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విభజన లేదు. కొన్ని చోట్ల ఇప్పటికీ తాలూకాలు పెద్దవిగా కొనసాగుతున్నాయి. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మండలాల పేరుతో పూర్తి వికేంద్రీకరణ జరిగింది. రాజ్యాంగ సవరణలతో పంచాయతీ పరిపాలనలో పరోక్ష ఎన్నికలతో అయిదు అంచెల వ్యవస్థని ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచిందే తప్ప శక్తివంతం చేయలేదు. ఇటువంటిదే శాసన మండలి వ్యవస్థ. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు ఇంకో రెండు సంవత్సరాలలో చేసుకోబోతున్నా అసలు శాసన మండలి వ్యవస్థ కి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కొన్ని రాష్ట్రాలు రెండు సభల వ్యవస్థ పాటిస్తుంటే మరికొన్ని అసెంబ్లీ ఒక్కటితోనే కొనసాగుతున్నాయి. అదే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయనాయకుల ఇష్టానుసారం పెట్టటం తీసివేయటం జరుగుతుంది. అంటే ఈరోజుకీ ఓ పద్దతి లేదు. ఎవరిష్టం వారిది. మొత్తం పరిపాలనా సంస్కరణలపై సమగ్ర అధ్యయనం చేపట్టాల్సి వుంది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగానే జిల్లాల పునర్విభజనని చూడాల్సివుంది.

    ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు పెంపు చేయొచ్చు 

    ఇందాకనే ప్రస్తావించినట్లు దీనిపై ఎటువంటి మార్గదర్శకాలు లేవు. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోల్చిచూసుకోవటం, హేతుబద్దంగా ఆలోచించటం లాంటి ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకోవల్సివుంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటు నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంది. అంటే 13 జిల్లాలు 25 అవుతాయన్నమాట. అప్పుడు జిల్లా సగటు జనాభా 38 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గుతుంది. అదే అరకు రెండుగా విభజించితే 26 అవుతాయి. అప్పుడు 19 లక్షలు సగటు జనాభా అవుతుంది. ఇది ఇప్పటివరకు ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం లెక్కలు. జనాభా పరంగా ఇది జాతీయ సగటుకి 2, 3 లక్షలే ఎక్కువగా వుంటుంది. కాబట్టి  సంఖ్యాపరంగా  ఇది వివాదాస్పదమేమీ కాదు.

    కాకపోతే అసలు పార్లమెంటు నియోజకవర్గాల భౌతిక స్వరూపం ఎంతవరకు కరేక్టనేది ఒక్కసారి పరిశీలించాలి.  జిల్లాల ఏర్పాటులో వాటి సామాజిక, సాంస్కృతిక సామీప్యం, నైసర్గిక స్వరూపం, చారిత్రిక నేపధ్యం ( కొన్ని సందర్భాల్లో) లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోనే సరిహద్దులు నిర్ణయించాలనటం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. అధ్యయన కమిటీ దీనిపై విస్తృత అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే బాగుంటుంది.ఇందుకోసం సంఖ్యా పరంగా కూడా పట్టు విడుపులు వుండాలి. 25 నుంచి 30 జిల్లాల వరకు జిల్లాల సంఖ్య ఉండేటట్లు గా ప్రతిపాదనలు వుంటే బాగుంటుంది. సంఖ్య 30 అయ్యేటట్లయితే జిల్లా సగటు జనాభా 16.5 లక్షలు వుంటుంది. ఇది జాతీయ సగటుకి దగ్గరగా వుంటుంది. కాబట్టి పార్లమెంటు నియోజక వర్గాలు ముందుగా ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కింద జనం అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకొని పట్టు విడుపులతో కనుక ప్రతిపాదనలు తయారు చేస్తే ప్రజామోదం తో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకోణం లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.