https://oktelugu.com/

నిజమైన కార్యకర్తలను చేరదీస్తే జనసేనకు తిరుగు ఉండదా?

ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలికిపిట్టది మరోదారి.. రాజకీయాలంటేనే చురుకుగా ఉండాలి. ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజల్లోనే ఉండాలి.  కానీ పార్టీని పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ అమావాస్య చంద్రుడిలా 15 రోజులకోసారి ఏపీ రాజకీయ యవనికపై మెరుస్తుంటాడన్న విమర్శలు కొనితెచ్చుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా సినిమాలు చేస్తూ మధ్యలో రాజకీయం చేస్తూ తన రాజకీయ కాలం అలా గడిపేస్తున్నారు. పార్టీ పుట్టి ఐదారేళ్లు అయినా క్షేత్రస్థాయిలో కమిటీలు లేవు. పార్టీని బలోపేతం చేద్దామన్న కనీస సృహ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2021 / 08:02 PM IST
    Follow us on

    ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలికిపిట్టది మరోదారి.. రాజకీయాలంటేనే చురుకుగా ఉండాలి. ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజల్లోనే ఉండాలి.  కానీ పార్టీని పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ అమావాస్య చంద్రుడిలా 15 రోజులకోసారి ఏపీ రాజకీయ యవనికపై మెరుస్తుంటాడన్న విమర్శలు కొనితెచ్చుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా సినిమాలు చేస్తూ మధ్యలో రాజకీయం చేస్తూ తన రాజకీయ కాలం అలా గడిపేస్తున్నారు. పార్టీ పుట్టి ఐదారేళ్లు అయినా క్షేత్రస్థాయిలో కమిటీలు లేవు. పార్టీని బలోపేతం చేద్దామన్న కనీస సృహ పవన్ కు లేదు. ఎన్నికల వేళ ఏదో పార్టీకి మద్దతిచ్చి చేతులు దులుపుకోవడం.. జనసైనికులను పరాయి పార్టీకి మద్దతివ్వాలని కోరడం తప్ప.. పార్టీని ఓన్ చేసుకొని బలోపేతం చేద్దామన్న ఆలోచనే పవన్ కు రావడం లేదన్న జనసైనికులు, విశ్లేషకుల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ..

    ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార వైసీపీ , ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్, చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. కానీ మన ఘనత వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ పంచాయతీని.. కనీసం జనసేన క్యాడర్ ను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.

    *పవన్ ది కాదు.. జనసైనికులదే ఈ క్రెడిట్
    ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ జనసేనాని పవన్ రాకపోయినా.. పార్టీలో నంబర్ 2 నేత నాదెండ్ల మనోహర్ పట్టించుకోకపోయినా.. పెద్ద లీడర్లు ముందుకు రాకపోయినా..  క్యాడర్ మాత్రం పంచాయతీ ఎన్నికల గెలుపు బాధ్యతను తమ భుజాన వేసుకుంది. ఫలితం జనసేనకు మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 18శాతంకు పైగా ప్రజలు  ఓటేస్తే.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 22శాతానికి పైగా ప్రజలు జనసేనకు పట్టం కట్టారు. ఈ గణాంకాలను చూసి జనసేనాని బయటకు వచ్చి హైదరాబాద్ లో వీటిని ఘనంగా చెప్పుకొని ఈరోజు సంబరపడిపోయాడు. కానీ ఎవ్వరు రాకున్నా.. నేతలు పట్టించుకోకున్నా కూడా గ్రామాల్లో జనసేనకు ఇంతటి ఆదరణ దక్కిందంటే పవన్ కానీ, నాదెండ్ల కానీ.. ఆ పార్టీ నేతలు ఎంత మాత్రం కాదు.. ఆ పార్టీనే నమ్ముకొని.. పవన్ అంటే పిచ్చి ప్రేమతో ఉన్న అభిమానులు, కార్యకర్తలతోనే ఈ గెలుపు సాధ్యమైంది. పవన్ వదిలేసినా ఈ పార్టీని ఏకంగా 22 శాతం ప్రజల మెప్పు పొందారంటే ఈ ఘతన అది క్షేత్రస్థాయి నేతలదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. .

    *జనసేనకు బలం లేకున్నా పంచాయతీలను ఎలా గెలిచింది?

    నిజానికి అధికార వైసీపీతో పోల్చినా.. ప్రతిపక్ష టీడీపీతో పోల్చినా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల బలం జనసేనకు అస్సలు లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ పవన్ అంటే అభిమానమున్న యువత, విశ్వసనీయత గల యువతరం నాయకులు జనసేనను ఓన్ చేసుకొని గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుపొందారు. ఇక కాపు కులం కూడా జనసేన గెలవడానికి దోహదపడిందంటారు. జనసేన పార్టీతో సంబంధం లేకుండా కాపులంతా జనసేన తరుఫునే నిలబడ్డారు. వాళ్ల కులమే గ్రామాల్లో జనసేనను గెలిపించిందంటున్నారు. కులం కార్డుతోనే జనసేనకు ఈ అందలం దక్కిందంటున్నారు. 
     
    *అసెంబ్లీకి ఈ 22శాతం ఓట్లు ఎందుకు పడవు?
    గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 22 శాతం వరకు ఓట్లు సంపాదించిన జనసేన.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తేలిపోతోంది. కనీసం కాపు ఓట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా జనసేనాని పవన్  గెలవలేకపోయాడు? ఎందుకు? తేడా ఏంటి? అంటే పవన్ ఎన్నికల్లో ఏదో పార్టీకి మద్దతు తెలుపుతూ.. జనసైనికులను, నేతలను నిండా ముంచడమే. ప్రజల్లో, కాపునేతల్లో విశ్వాసాన్ని తెచ్చుకోలేకపోవడమే.. మొన్నటికి మొన్న హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయించి మరీ బీజేపీ ఒత్తిడికి జనసేన నేతలను విత్  డ్రా చేయించాడు. ఇక తిరుపతి ఎంపీ సీటును బీజేపీకి ధారదత్తం చేస్తున్నాడు. ఇలాగే సాగితే జనసేన కోసం పాటుపడుతున్న.. పనిచేస్తున్న జనసైనికులు ఇక పక్క పార్టీల పల్లకీ మోసే వారిగానే ఉండాలా? వారికి సీట్లు, గెలుపు వద్ద అన్న నిసృహ వారిలో నెలకొంది. పవన్ కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతరులకు మద్దతు ఇవ్వడం.. జనసేననే నమ్ముకొని ఉన్న వారిని నట్టేట ముంచడం సర్వసాధారణమైపోయిందన్న ఆవేదన వారిలో ఉంది.. అదే గ్రామాల్లో చూసుకుంటే ఈ ధోరణి ఉండదు. జనసేన తరుఫున గ్రామంలో నేతలు, యువతి స్వచ్ఛందంగా నిలబడుతారు. అందుకే అక్కడ గెలుపు సాధ్యమైంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే జనసేన పరిస్థితి వేరుగా ఉండేది. ఆ విస్తరణ లేకపోవడం ఇప్పుడు పవన్ పార్టీకి శాపమవుతోంది. 
     
    *గ్రామస్థాయిలో పట్టించుకోని పవన్
     ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 22శాతం ఓటు బ్యాంకును జనసేన కైవసం చేసుకోవడం.. పంచాయతీ సర్పంచ్ లను గెలుచుకోవడం చూసి చాలా రోజుల తర్వాత పవన్ బయటకొచ్చి చంకలు గుద్దుకున్నాడు. కానీ ఇవే ఓట్లు అసెంబ్లీకిలో ఎందుకు సంపాదించుకోలేదని ఒక్కసారి సమీక్షించుకుంటే ఇప్పుడు జనసేనకు ఈ దుస్థితి ఉండేది కాదని జనసైనికులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ లెవల్లో కష్టపడే జనసేన కార్యకర్తలను, కాపు ఓటు బ్యాంకును గుర్తించి ఓన్ చేసుకుంటే జనసేనకు తిరిగి ఉండేది కాదు. ఏ ఒక్క పార్టీ నేత అండ లేకున్నా.. జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ లు, వార్డు మెంటర్లుగా గెలవడం అంటే అది మాటలు కాదు..నిజానికి జనసేన ఇంతకంటే మెరుగైనా శాతాన్ని సీట్లను గెలుచుకునేది. జనసైనికులు గ్రామాల్లో  ఓడిపోయిన చోట కూడా 10 ఓట్లు తేడా..1 ఓట్ల తేడాతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించిన గ్రామాలున్నాయి. దీన్ని బట్టి గ్రౌండ్ లెవల్లో జనసేన కార్యకర్తలను ప్రోత్సహిస్తే జనసేనకు తిరుగుండదని విశ్లేషకులు సూచిస్తున్నారు. గ్రామస్తాయిలో పార్టీని విస్తరించి మంచి యువతతో కమిటీలు వేసి ప్రజాసమస్యలపై పోరాడితే జనసేన ఏపీలో గట్టి పోటీనిచ్చే పార్టీగా నిలబడుతుంది. ఈ పంచాయతీ ఎన్నికలతోనైనా పవన్ కళ్లు తెరిస్తే మంచిందంటున్నారు.
     
    * పంచాయతీ ఫలితాలతో పవన్ కళ్లు తెరవాలిక..
    ఇప్పటికైనా పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని   పంచాయతీ ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఏపీలో 22 శాతం ఓట్లు సాధించారంటే అది జనసేనాని పవన్ పై ఉన్న నమ్మకం కాదు. ఆ పార్టీని నమ్ముకొని పోటీచేసిన యువత, నేతల పై ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి.. మంచి నాయకులను తయారు చేసి..యాక్టివ్ గా ఏపీ రాజకీయ తెరపైకి తీసుకొచ్చి.. కింది నుంచి పార్టీని విస్తరిస్తే జనసేన కథ వేరే లెవల్లో ఉంటుంది. ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో చంకలు గుద్దుకొని మళ్లీ అమావస్య చంద్రుడిలా  పవన్ సినిమాలు చేసుకుంటూ క్యాడర్ ను, పార్టీని పట్టించుకోకుంటే మాత్రం ఇలానే అథోగతి పాలవుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని.. జనసేన బలం బయటపడ్డ వేళ దాన్ని అందిపుచ్చుకోవాలని మేధావులు, క్యాడర్ ఆశిస్తోంది. మరి పవన్ బయటకు వస్తాడా? పార్టీ కోసం పాటుపడుతాడా? అన్నది వేచిచూడాలి..