పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో బెంగాల్ అట్టుడుకుతోంది. ఇది బీజేపీ కార్యకర్తలే పనియే అని తృణమూల్ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిరసనలపై మమతా బెనర్జీ స్పందించారు. ఆస్పత్రి నుంచే తమ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగనివ్వవద్దని.. శాంతియుతంగా ఉండాలని కోరారు. అవసరమైతే చక్రాల కుర్చీలో కుర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
తాజాగా నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన అనంతరం ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో మమతా బెనర్జీ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయంగా దుమారం రేపింది. సీఎంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని.. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
మమతా బెనర్జీ కారు ఎక్కుతూ దేవుడిని స్మరించుకుంటున్న వేళ కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమెను తోసేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మమతా ఎడమకాలి మడమ ఎముకకు, పాదానికి, మోకాలికి గాయమైంది.
మమతా బెనర్జీకి ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్వయంగా మమతా బెనర్జీ తెలిపారు. అవసరమైతే వీల్ ఛెయర్ లో కూర్చొని ప్రచారం చేస్తానని తెలిపారు. అందకు కార్యకర్తలు ప్రజల సహకారం కావాలని కోరారు.
కాగా మమతా బెనర్జీపై దాడిని బీజేపీ ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని.. అది కేవలం ప్రమాదమేనని కొట్టిపారేసింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మమతా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.
দলনেত্রীর @MamataOfficial আবেদন pic.twitter.com/SPoD3m7Iu3
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021