వైరల్: ‘గోవు’ చుట్టూ రాజకీయం.. నిజమెంత?

భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతోంది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆవుకు సంబంధించి అనేక అశాస్త్రీయ అంశాలు ఆపాదిస్తున్నారు. వాటిలో కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆ అశాస్త్రీయ అంశాలు, వాటిని ఖండిస్తూ… ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ మాజీ డైరెక్టర్‌, డాక్టర్‌ డి. బాలసుబ్రమణ్యన్‌ ఇచ్చిన వివరణలు ఇలా ఉన్నాయి. *ఆపాదించిన అంశం 1: ఒక ఆవుకు ప్రతిరోజూ కొంత మోతాదులో విషం ఇవ్వడం […]

Written By: NARESH, Updated On : March 7, 2021 6:55 pm
Follow us on

భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతోంది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆవుకు సంబంధించి అనేక అశాస్త్రీయ అంశాలు ఆపాదిస్తున్నారు. వాటిలో కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆ అశాస్త్రీయ అంశాలు, వాటిని ఖండిస్తూ… ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ మాజీ డైరెక్టర్‌, డాక్టర్‌ డి. బాలసుబ్రమణ్యన్‌ ఇచ్చిన వివరణలు ఇలా ఉన్నాయి.

*ఆపాదించిన అంశం 1: ఒక ఆవుకు ప్రతిరోజూ కొంత మోతాదులో విషం ఇవ్వడం జరిగింది. 24 గంటల తర్వాత ఆ ఆవు రక్తం, మూత్రం, పేడ, పాలు పరీక్షించబడ్డాయి. ఎక్కడో తెలుసా? న్యూఢిల్లీలోని ‘ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ (ఎయిమ్స్‌) పరిశోధనాశాలలో. ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు. 90రోజుల పాటు పరిశోధించడం జరిగింది. పరిశోధకులు ఆ ఆవు పాలు, రక్తం, మూత్రం, పేడలలో ఎక్కడా విషపు ఛాయలను కూడా కనుగొనలేకపోయారు. ఆ విషం ఎటుపోయింది? గో మాత విషం మొత్తాన్ని తన గొంతులో దాచుకుంది. ఏ ఇతర జంతువుకూ లేని ప్రత్యేక లక్షణమిది! ‘ఎయిమ్స్‌’లోని కొందరు బోధనాచార్యులను నేను అడిగి తెలుసుకున్న విషయమేమంటే… అక్కడ అలాంటి ప్రయోగమేదీ జరగలేదు. ఆ సంస్థకు చెందిన ‘జంతువుల నైతిక విలువల కమిటీ’ ఏ జంతువుకైనా ప్రయోగం కోసమైనా, ఒక్క రోజైనా విషం ఇవ్వడానికి అంగీకరించదని అక్కడి ఆచార్యులు నొక్కి వక్కాణించారు!

*ఆపాదించిన అంశం 2 : ఈ భూమి మీద నివశించే జంతువులన్నింటిలో ఆవు ఒక్కటే ఆక్సిజన్‌ను పీల్చుకొని, ఆక్సిజన్‌ను విసర్జించగలదు. మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరిపి, ఆక్సిజన్‌ను వదలగలవు. అంతేకాని, ఏ జంతువుకూ ఆక్సిజన్‌ను వదలగల శక్తి లేదు. అయితే, మనుషులు గానీ, జంతువులు గానీ పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌లోని కొంత భాగాన్ని నిశ్వసించే గాలితోబాటుగా వదులుతాయి. ఏ ఆవునైనా పరీక్షించినప్పుడు దాని నిశ్వాసంలోని గాలిలో కొంచెం ఆక్సిజన్‌ ఉన్నట్టు కనబడటానికి కారణం ఇదే. మనుషులను పరీక్షించినా వారి శ్వాసలోని గాలిలో కొంత ఆక్సిజన్‌ ఉన్నట్టు రుజువవడానికి కూడా కారణం అదే. నీటిలో మునిగిన వారిని బయటికి తీసిన తర్వాత నోటితో గాలిని ఊది ఆక్సిజన్‌ను అందిస్తారు.

*ఆపాదించిన అంశం 3 : విషాన్ని విరిచే శక్తి ఆవు పాలకు ఉంది. విషం అనే పదం చాలా విస్తారమైనది. ఏ విషం? సయనైడా? డీడీటీనా? విషాన్ని ఆవు పాలు విరుస్తాయనే దానికి రుజువేమిటి? సైన్సుగాని, చట్టంగాని రుజువులేనిదే, దేనినీ అంగీకరించదు. రుజువు చేయలేని అంశాన్ని ఎలా రుజువుచేస్తాం? ఎలా ఖండిస్తాం?

*ఆపాదించిన అంశం 4: ఆవు మూత్రం విషపూరితమైన సూక్ష్మక్రిములను చంపుతుంది. జంతువుది గానీ, మనిషిదిగానీ ఏ మూత్రమైనా బ్యాక్టీరియాను చంపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దానికి కారణం కూడా తెలిసిందే. మూత్రంలో ఉండే ఎసిడిటీ (తక్కువ పీహెచ్‌ విలువ), అమ్మోనియం సంయోగ పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. ఆవు మూత్రంలో వేరే ప్రత్యేకత ఏమీ లేదు (ఏప్రిల్‌ 2012 నాటి ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఫార్మాసుటికల్‌ రీసెర్చ్‌’ అనే పత్రికలో ఎ. అహుజా సమర్పించిన పత్రం,

*ఆపాదించిన అంశం 5 : నేల, గోడలూ ఆవు పేడతో అలికితే, రేడియో తరంగాల నుంచి మనల్ని కాపాడుతుంది. ‘రేడియో తరంగాలు’ అనేది విశాలమైన అర్థంతో కూడిన పదం. తరంగ దైర్ఘ్యం, శక్తి, తీవ్రత, ఫ్రీక్వెన్సీ లాంటివేవీ తెలుపకుండా రేడియో తరంగాల ప్రభావాన్ని చెప్పలేం. ఆవు పేడతో అలికినా, అలకక పోయినా రేడియో, టీవీలు క్షేమకరంగానే పని చేస్తాయి. అలాగే సెల్‌ఫోన్లు, వైఫైలు కూడా. అసలు ఇబ్బంది రేడియో తరంగాలను గూర్చి ప్రత్యేక స్పెసి ఫికేషన్లు పేర్కొనకుండా చేసే ప్రకటనలతోనే వస్తుంది.

*ఆపాదించిన అంశం 6 : పది గ్రాముల ఆవు నెయ్యిని నిప్పుల్లో పోస్తే (యజ్ఞాలలో), ఒక టన్ను (1000 కేజీల) ఆక్సిజన్‌ వెలువడుతుంది. ఇది భౌతిక శాస్త్ర నియమాలకే విరుద్ధం. ఏ ప్రయోగంలోనైనా 10గ్రాముల పదార్థం 1000 కిలోగ్రాముల పదార్థాన్ని సృష్టించలేదు. మన పూర్వీకులైన మునులెప్పుడో కనుగొన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో ఎప్పుడో రుజువులు కనుగొంటారనో, వాళ్ళ ప్రకటనలను వ్యతిరేకించేవారు హిందూ నమ్మకాలకు వ్యతిరేకులనో విమర్శించడం సరైన చర్య కాదు. సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న అశాస్త్రీయ అంశాలను సమర్థ వంతంగా ఎదుర్కోవడం దేశభక్తులందరి కర్తవ్యం.