https://oktelugu.com/

అమెరికా ఎన్నికలు: పెద్దన్న కాబోయేది ఎవరో..?

ప్రపంచానికి పెద్దన్న పాత్ర ఎవరు పోషించబోతున్నారనేది తేలడానికి సమయం ఆసన్నమైంది. అగ్రదేశ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇప్పుడు అసలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 11:43 am
    Follow us on

    U.S. Presidential Election Polling Today

    ప్రపంచానికి పెద్దన్న పాత్ర ఎవరు పోషించబోతున్నారనేది తేలడానికి సమయం ఆసన్నమైంది. అగ్రదేశ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇప్పుడు అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోందో వెల్లడి కానుంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్‌ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకంగా మారింది. 2016 ఎన్నికల తరహాలో పాపులర్‌ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్‌ రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్‌ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిమిషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్‌లు స్వింగ్‌ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆఖరి నిమిషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్‌ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్‌ రోజు రాత్రి ట్రంప్‌ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది.

    మెయిల్‌, ముందస్తు ఓటింగ్‌ ద్వారా ఇప్పటికే 9.2 కోట్ల మంది ఓట్లు వేసేశారు. ఇది మొత్తం రిజిస్టర్డ్‌ ఓటర్లలో 38 శాతం. దాదాపు 24 కోట్ల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లున్న అమెరికాలో 65 శాతానికి పైగా శ్వేతజాతీయులు. హిస్పానిక్స్‌, ఆసియన్లు, ఆఫ్రో అమెరికన్లు, ఐరోపా దేశాలవారు, ఇతర వలసదారులు మిగిలిన ఓటర్లు. వీరంతా 538 మంది ప్రతినిధులను (ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు- ఎలక్టర్స్‌)ని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టర్స్‌ కూడా డెమొక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలు నియమించిన వారే ఉంటారు. మేజిక్‌ ఫిగర్‌ 270 అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు సాధించిన వ్యక్తి అధ్యక్షుడవుతారు. అమెరికా అధ్యక్ష పీఠాన్నే కాక, ప్రపంచ రాజకీయాలను కూడా గట్టిగా ప్రభావితం చేసే ఈ ఎన్నికలు ఓ రకంగా అగ్రరాజ్యం సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న దశలో జరుగుతున్నాయి.

    Also Read: అమెరికాలో సామాజికకోణం ఫలితాన్ని నిర్ణయించబోతుందా?

    ప్రచారఘట్టం చివరి రోజైన సోమవారం డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ ఉధృతంగా ప్రభావ రాష్ట్రాల సభల్లో మాట్లాడారు. రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ సర్వే ప్రకారం- ఇద్దరి మధ్య ఈ ప్రభావ రాష్ట్రాల్లో తేడా కేవలం 3.7 శాతం ఓట్లే ఉంది. ముఖ్యంగా  ఫ్లోరిడా (1.4 శాతం), నార్త్‌ కరోలినా (0.3శాతం), అరిజోనా (1.2శాతం)ల్లో బాగా తక్కువగా ఉంది. మిగిలిన వాటిలో కూడా ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో తేడా 5-6 శాతం కంటే ఎక్కువ లేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఎక్కువమంది ఓటర్లు ఓటెయ్యాలని, అదే తనను గెలిపిస్తుందని ట్రంప్‌ నమ్మకంతో ఉన్నారు. గతంలో బరాక్‌ ఒబామా కింద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన  జో బైడెన్‌ కూడా విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. మొత్తం 50 రాష్ట్రాలకు గాను- రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో జరిపిన దాదాపు అన్ని సర్వేలూ ఆయనకు ట్రంప్‌ కంటే కనీసంలో కనీసం  8 శాతం ఆధిక్యత కట్టబెట్టాయి. అందుకే ఆయన ఆఖరిరోజున కేవలం పెన్సిల్వేనియా, ఒహాయోల్లో మాత్రమే మాట్లాడారు. తాను  జన్మించిన పెన్సిల్వేనియాలో నువ్వా-నేనా అన్న పరిస్థితి ఉండడంతో బైడెన్‌ దీనిపై ఎక్కువగా దృష్టిపెట్టారు.

    రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బరిలో ఉండగా, కమలా హారిస్‌ డెమొక్రట్ల తరఫున వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీపడుతున్నారు. ట్రంప్‌- నార్త్‌ కరోలినా, మిచిగన్‌, విస్కాన్‌సన్‌, పెన్సిల్వేనియాల్లో సుడిగాలిలా తిరిగారు. ఇక్కడ నాలుగేళ్ల క్రితం హిల్లరీ కంటే ట్రంప్‌కే ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఆర్థిక రంగంలో, అక్రమ వలసలు అడ్డుకొనే విషయంలో తన విజయాలను ట్రంప్‌ పదేపదే వల్లెవేశారు. కోవిడ్‌ సహా అన్ని రంగాల్లో ట్రంప్‌ వైఫల్యాలను బైడెన్‌ తన ప్రచార సభల్లో వినిపించారు.

    Also Read: అంబానీకి షాక్.. ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధం!

    ట్రంప్‌కు మద్దతుగా హ్యూస్టన్‌లో వందల మంది భారతీయ అమెరికన్లు పెద్ద కార్‌ ర్యాలీ తీశారు. మైళ్ల పొడవున ట్రంప్‌ ఫొటోతో ఉన్న కార్లు బారులు తీరడం కనిపించింది. అనేక మంది టెకీలను తీవ్రంగా దెబ్బతీసిన కొత్త ఇమిగ్రేషన్‌, హెచ్‌1బీ నిబంధనలపై ఆగ్రహంగా ఉన్న భారతీయ అమెరికన్లు ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నారు. కనీసం 68 శాతం మంది బైడెన్‌కు అనుకూలంగా, 32 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతుగా ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది.  పోలింగ్‌ జరిగే రోజు రాత్రి అంటే నవంబరు 3 రాత్రే (భారత కాలమానం ప్రకారం 4వ తేదీ ఉదయం) ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని, కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చని తెలుస్తోంది.