ఏపీలోని అధికార వైసీపీ సర్కార్ ను ప్రత్యర్థులంతా కలిసి టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. అది మరిచిపోకముందే ఇప్పుడు మరో షాక్ జగన్ సర్కార్ కు తగిలింది.
తాజాగా సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆధారాలు తనవద్ద ఉన్నాయని.. అవన్నీ బయటపెడుతానంటూ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సీబీఐకి సంచలన లేఖ రాశారు. ఏబీ రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖలో ప్రధానంగా వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే వరకు ఘటనా స్థలిని ఎంపీ అవినాష్ రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని.. పోలీసులు, మీడియా, ఇంటెలిజెన్స్ సిబ్బందిని వివేకా హత్య జరిగిన ఇంట్లోకి పోనీయలేదని ఏబీవీ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.
ఇక మరో బాంబు పేల్చారు. తన ఆధారాలు వైఎస్ వివేకాపై వేసిన సీబీఐ దర్యాప్తు అధికారి జేడీ ఎన్ఎం సింగ్ కు ఇద్దామని ఆయనను సంప్రదించినా ఆయన స్పందించలేదని ఏబీవీ ఆరోపించారు. ఎవరూ ఈ కేసులో పట్టించుకోవడం లేదని.. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని వివరించారు.
పులివెందులలోని ఆయన స్వగృహంలో వివేకానందరెడ్డి 2019 మార్చి 15న మరణించారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. గుండెపోటుతో బాత్ రూమ్ లో జారి పడిపోయారని ఆరోజు మధ్యాహ్నం వరకు మీడియాలో ప్రసారమైందని తెలిపారు. ఈ కేసులో ఆరోజు విచారణను అడ్డుకున్న వారిపై అనుమానాలున్నాయని ఆయన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.
మరీ ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై సీబీఐ స్పందిస్తుందా? విచారణను ఆ కోణంలో జరుపుతుందా? ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఎంత ఉంటుందనేది వేచిచూడాలి.