https://oktelugu.com/

ఈసారి కూడా టీఆర్ఎస్ సెంచరీ మిస్ అయినట్టేనా?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత 15రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు నగరంలో తిష్టవేసి ప్రచారాన్ని నిర్వహించడం జాతరను తలపించింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఇరుపార్టీలు తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చూస్తే టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ నుంచి మంత్రులు.. ఎమ్మెల్యే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 10:04 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత 15రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు నగరంలో తిష్టవేసి ప్రచారాన్ని నిర్వహించడం జాతరను తలపించింది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఇరుపార్టీలు తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లురుతున్నారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చూస్తే టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ నుంచి మంత్రులు.. ఎమ్మెల్యే రంగంలోకి దిగి ప్రచారం చేస్తే బీజేపీ తరుపున కేంద్ర మంత్రులతోపాటు జాతీయస్థాయి నేతలు ప్రచారం చేపట్టారు. ఈక్రమంలోనే నేతల మధ్య మాటలతూటాలు పేలాయి. కొన్నిచోట్ల నేతలు ఒకరిపై ఒకరు దాడులు దిగడం కూడా కన్పించింది.

    గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాలను గెలుచుకొని ఏకపక్షంగా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ అన్నితానై నడిపించారు. అయితే ఈసారి మాత్రం సీఎం కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. సీఎం ఆదేశాలను మంత్రి కేటీఆర్ కిందిస్థాయిలో అమలయ్యేలా సమన్వయం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు.

    అయితే సర్వేలు మాత్రం ఈసారి కూడా టీఆర్ఎస్ సెంచరీ కొట్టలేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. మొత్తం 150సీట్లు ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56నుంచి 60.. బీజేపీ 48 నుంచి 53… మజ్లిస్ 35నుంచి 40.. కాంగ్రెస్ 6నుంచి 10 స్థానాలు గెలుచుకుంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల ఆయా పార్టీలకు రెబల్స్ బెడద ఉండటంతో కొన్నిస్థానాలు అటు ఇటుగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

    గ్రేటర్ సర్వే నేపథ్యంలో టీఆర్ఎస్ మాత్రం మేయర్ పీఠాన్ని దక్కించుకొని పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. గ్రేటర్ పీఠం దక్కాలంటే 71కార్పొరేటర్లు ఖచ్చితంగా కావాల్సిందే. దీంతో ఈమేరకు లెక్కలు వేసుకుంటూ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎక్స్ అఫిషీయో 25సభ్యులుండగా మరో ఆరుగురిని ఇక్కడే నమోదు చేయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

    మొత్తం 31నుంచి 33 ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మజ్లిస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాల్సి వస్తే మాత్రం అధికార పార్టీకి మున్ముందు మరిన్ని ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ సెంచరీపై కాకుండా 71 స్థానాలపై ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.