
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కుప్పకూలింది. దారుణంగా ఓడిపోయింది. అయితే టెస్ట్ సిరీస్ లో రాణించి ఫామ్ లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టడం విమర్శలకు కారణమైంది. రోహిత్ ఉంటే ఇంత తక్కువ పరుగులకు టీమిండియా పరిమితం అయ్యిండేది కాదని.. అనవసరంగా పక్కనపెట్టారని టీం మేనేజ్ మెంట్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ లో ఉండడంతో అతడు ఉంటే ఇంత తక్కువ స్కోరుకు ఇండియా పరిమితం అయ్యిండేది కాదని.. అతడిని పక్కనపెట్టడంపై ఇప్పటికీ కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు కురుస్తున్నాయి.
తుదిజట్టులో రోహిత్ పేరు కనిపించకపోవడంతో అతడికి గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ రోటేషన్ పద్ధతిలో భాగంగానే హిట్ మ్యాన్ కు విశ్రాంతిని ఇచ్చారని తర్వాత తెలిసింది.
ప్రపంచకప్ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతోనే రోటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే వైస్ కెప్టెన్ అయినా కూడా తొలి మ్యాచ్ కు రోహిత్ ను దూరం పెట్టింది టీం మేనేజ్ మెంట్. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేసినా ఫాంలో ఉన్న రోహిత్ దూరం కావడం తొలి మ్యాచ్ లో భారత్ ను తీవ్రంగా దెబ్బతీసింది. రెండో మ్యాచ్ లోనైనా హిట్ మ్యాన్ ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇక రోటేషన్ లో భాగంగా తర్వాతి మ్యాచుల్లో మరికొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. రాబోయే మ్యాచుల్లో యువ ఆటగాళ్లకు చాన్సులు రావడం ఖాయమంటున్నారు. కానీ ఈ ప్రయోగాలు టీమిండియా కొంప ముంచకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు.