అధికార టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ నిలబడుతోంది. కాంగ్రెస్ శక్తియుక్తులు కూడగట్టుకుంటున్న వేళ అనూహ్యంగా ఏపీ నుంచి సీఎం జగన్ చెల్లెలు షర్మిల దూసుకొచ్చారు. అందరితో సమావేశం అవుతూ కాకపుట్టిస్తున్నారు. తాజాగా ఆమె వ్యూహాలు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన షర్మిలకు తెలంగాణ యువత ఎందుకు మద్దతిస్తోంది..? ఇన్నాళ్లు కేవలం ఆత్మీయ సమావేశాలు అని చెప్పిన ఆమె ఇక పార్టీ పెట్టనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన వైఎస్ షర్మిల కొన్ని ఆసక్తి కర కామెంట్లు చేశారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ యువత ఆమె వైపే ఉన్నారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి పీటంపై కూర్చున్న కేసీఆర్ రైతులకు ప్రాధాన్యం ఇచ్చారు. వారి కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెడుతూ వారిని అక్కున చేర్చుకున్నారు. ఇక వృద్ధులకు డబుల్ పింఛన్లు ఇస్తూ వారికి ఆరాధ్య దేవుడిగా నిలిచారు. మరోవైపు తన పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ మంత్రి పదవులను కట్టబెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదట్లో వారు ఊహించని పిట్మెంట్ ఇచ్చి వారి చేత పాలాభిషేకాలు చేయించుకున్నారు. కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసి పేదల దైవం అని పేరు తెచ్చుకున్నాడు.
ఇవన్నీ చేసిన కేసీఆర్ యువతను పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన వారికి నిరాశే మిగలించి. పోలీస్ రిక్రూట్ మెంట్ మినహాయించి భారీ మొత్తంలో నోటిఫికేషన్లు వేసిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత ఎన్నికల్లో యువత ఉద్యోగాలు వేయాలని రకరకాల మాధ్యమాల ద్వారా తమ గోడు వినిపించినా వారిని తప్ప మిగతా వారందరికీ అనేక పథకాలు ప్రకటించారు. దీంతో ఒకప్పుడు కేసీఆర్ కోసం ఆరాధించిన వారు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ తరుణంలో షర్మిల నిరుద్యోగుల నాడి పట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను పెట్టబోయే పార్టీకి వీరే బలం అని గ్రహించిన ఆమె వారితో నిర్వహించిన సమావేశంలో ఉద్వేగానికి ఫీలయ్యారు. ‘మీకోసం నేను నిలబడతా.. మిమ్మల్నీ నిలబెడుతా’ అనే నినాదంతోనే ఆమె ప్రజల్లోకి వెళ్తోందని చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టినా వాటిలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని మొన్నటి వరకు బీజేపీ ప్రచారం చేసింది. ఒకవేళ బీజేపీ చెప్పింది అబద్దమని పథకాలు పొందినవారు అనుకున్నా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించేది కాకపోవచ్చు.
అయితే బీజేపీ మతతత్వ పార్టీ అని టీఆర్ఎస్ ప్రచారం చేసినా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తన ప్రతాపం చూపించి రెండో స్థానంలో నిలిచింది. మొదటి నుంచి బీజేపీకి యువత సపోర్టు ఉన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించినా పట్టించుకోలేదు. కానీ ఉద్యోగాల కోసం ఆహార్యాలు కాస్తున్నవారిని కేసీఆర్ ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
తాజాగా షర్మిల సైతం యువతను అక్కున చేర్చుకుంటే తమ మనుగడ సాధించవచ్చని భావించారు. ఈ సమయంలో ఆమె ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ సమావేశంలోనే ఆమె పార్టీ పెడుతానని ప్రకటించడంతో యువతకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి యువత షర్మిల పార్టీ వైపు మొగ్గుతారా..? లేదా..? చూడాలి..