
దేశంలో బంగారం ధర అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా బంగారం విషయంలో అప్రమత్తంగా ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం ఏకంగా మూడు లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని చెత్తలో పడేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల బంగారం పోయి సదరు మహిళ బాధ పడుతోంది.
పుణెలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే పుణెలోని పింప్లే-సౌదాగర్ ప్రాంతంలో రేఖ సులేఖ అనే మహిళ నివశిస్తూ ఉండేది. దీపావళి పండుగ నేపథ్యంలో రేఖ ఇంటిని శుభ్రం చేసింది. ఈ క్రమంలో బంగారం ఉన్న చేతి సంచిని సైతం చెత్తలో కలిపేసింది. ఆ తరువాత మున్సిపాలిటీ వాహనంలో ఆ చెత్తను పారేసి వెళ్లిపోయింది. అయితే కొన్ని గంటల తరువాత ఇంట్లో రేఖకు బంగారం కనిపించలేదు.
బంగారం గురించి ఆలోచించగా అప్పుడు రేఖ తనే స్వయంగా బంగారాన్ని చెత్తలో పడేశానని అర్థమైంది. సామాజిక కార్యకర్త సంజయ్ కుటేకుకు ఫోన్ చేసి జరిగిన పొరపాటు గురించి వివరించి చెప్పింది. ఆ వ్యక్తి మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ కు నగలు ఉన్న చేతి సంచి గురించి సమాచారం ఇచ్చాడు. సానిటరీ ఇన్స్‌పెక్టర్ సుశీల్ మలాయీ సిబ్బందితో నగల సంచి గురించి వెతికించారు.
దాదాపు గంట సమయం సిబ్బంది ఎంతో శ్రమించగా చివరకు చేతి సంచి లభించింది. దీంతో రేఖ సులేఖ ఊపిరి పీల్చుకుంది. బంగారం చెత్తలో పడేశానని తెలిసిన తరువాత తనకు గుండె ఆగినంత పనైందని ఆ తర్వాత బంగారం సంచి లభించడంతో ఊపిరి పీల్చుకున్నానని రేఖ చెప్పుకొచ్చారు.