
ఎన్నో అడ్డంకులు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ పంతాలు.. ఏపీ ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొలి పోలింగ్ ఈరోజు ఉదయం ఆరంభమైంది. గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లువేస్తున్నారు. కరోనా తీవ్రతను పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా రోగుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొద్దిసేపటి క్రితమే పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 2723 గ్రామ పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాసులకు ఓటుకు డబ్బులు, ప్రయాణ ఖర్చులు ఇవ్వడంతో భారీఎత్తున ఆంధ్రాకు క్యూ కట్టారు. గ్రామస్థాయి ఎన్నికలు కావడంతో తమకు తెలిసిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.
ఏపీలోని 12 జిల్లాల్లో 2723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల్లో 7506 సర్పంచ్ స్థానాలకు పోటీ జరుగుతోంది. 20157 వార్డు సభ్యుల స్థానాలకు 43601మంది బరిలో ఉన్నారు. పోలింగ్ కు 88523 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఎన్నికలకు ఏపీ వ్యాప్తంగా 23732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం ఏపీ వ్యాప్తంగా 3249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు , చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు.
తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో నోటాను అమల్లోకి తెచ్చారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఏ ఒక్క అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. అయితే గ్రామస్థాయిలో ఇది పెద్దగా ప్రజలు వాడే ఛాన్స్ లేదు.