
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఇప్పుడు బోల్తాపడిపోయాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్.. నాడు సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడగొట్టి తనను గెలిపిస్తే వారంలోపు పసుపు బోర్డు తీసుకొస్తానని.. ఈ మేరకు పసుపు రైతులకు బాండ్ పేపర్ పై రాసిచ్చాడు ఇదే అరవింద్. అయితే గెలిచి రెండేళ్లు అయినా నిజామాబాద్ కు పసుపు బోర్డు రాలేదు. దగాపడ్డ రైతులు ఆయనను నిలదీస్తే ‘సుగంధ ద్రవ్యాల బోర్డు’ ప్రాంతీయ కార్యాలయం వచ్చిందని సర్ధి చెబుతున్నారు.
తాజాగా ఇదే విషయంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పసుపును దేశంలో 50శాతం పండించే నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుతో వంగడాలపై పరిశోధనలు సాగుతాయని.. మార్కెటింగ్ మెరుగుపడుతుందని అన్నారు.
దానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానమిచ్చారు. నిజామాబాద్ లో ప్రత్యేకంగా పసుపు బోర్డు పెట్టాల్సిన అవసరం లేదని లోక్ సభలో కుండబద్దలు కొట్టారు. పసుపు బోర్డు చేయాల్సిన పని సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తుందని.. మరొకటి అవసరం లేదని స్పష్టం చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డుతో అవే లాభాలు కలుగుతున్నప్పుడు మరో ఎందుకని ప్రశ్నించారు.
దీంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పసుపు బోర్డు తేలేని ఎంపీ అరవింద్ వెంటనే రాజీనామా చేయాలని.. రైతులను మోసం చేసినందుకు వారితో కలిసి పోరాడాలని స్పష్టం చేశారు. పసుపు బోర్డు తేలేని ఎంపీ అరవింద్ మెడకు ఇప్పుడు రైతులతో కలిసి ఉచ్చు బిగించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణలో పసుపు బోర్డు కంటే మెరుగైన సుగంధ ద్రవ్యాల ఎక్స్ టెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ మాటలు నిజామాబాద్ రైతుల కడుపునింపేలా కనిపించడం లేదు. వారు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.