పంచాయతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ దాదాపు 20 శాతం మేర గ్రామాలను ఎకగ్రీవంగా చేసుకుంది. మిగతా చోట్ల ఎన్నికలు జరిగినా దాదాపు వైసీపీదే పైచేయి అన్నట్లు సాగింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలకే పట్టుబడుతోంది వైసీపీ. అయితే కొన్నిచోట్ల మాత్రం ప్రధాన ప్రతిపక్షకంగా టీడీపీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న రోజా తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తెలుగు తమ్ముళ్లు తిప్పి కొడుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రోజా. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో 94 స్థానాలకు 74కు వైసీపీ కైవసం చేసుకుంది. పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే రోజా తీవ్రంగా శ్రమించారు. అయితే టీడీపీ ఇన్ చార్జి గాలి భాను ప్రకాశ్ ప్రచారం చేయకుండానే 18 చోట్ల గెలిపించుకున్నారు. దీంతో టీడీపీ ఈ స్థానాల్లో గెలవడంతో పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యే షాక్ తిన్నారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడం చూసి వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. అయితే ఎన్నికలు లేకుండా నగరి, పుత్తూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చూస్తున్న రోజాకు తెలుగు తమ్ముళ్ల తీరును చూసి బెంబేలెత్తుతున్నారట. అయితే నగరి మున్సిపాలిటీలో 29 వార్డులుంటే కేవలం 6 వార్డులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. పుత్తూరులో 27 వార్డుల్లో ఒక్కటి మాత్రమే వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది.
ఏకగ్రీవాల కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడుతున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ భానుప్రకాశ్. టీడీపీ అభ్యర్థులందరినీ ఇప్పటికే ఇతర ఊర్లకు పంపించి వైసీపీకి దక్కకుండా చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో తెలియక వైసీపీ నేతలు తలపట్టుకున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఆనందమంతా మున్సిపల్ ఎన్నికల్లో పోయేటట్లు ఉందని వాపోతున్నారు. అయితే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ నుంచి గట్టి పోటీ ఇస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో ఎమ్మెల్యే రోజా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూడాలి.