తెలంగాణ గాంధీ కేసీఆర్ హైదరాబాద్ లో పోటీ చేయలేకపోవడమా?

తెలంగాణను సాధించిన ధీరుడు.. ఉద్యమానికి ఊపిరిలూదిన యోధుడు.. సమాజాన్ని ఏకం చేసిన ఘనుడు.. తెలంగాణ తొలి సీఎంగా అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు చేరువైన నాయకుడు.. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. సీఎం  కేసీఆర్ గురించి ఉపమానాలు ఎన్నో.. కానీ ఏ ప్రజలు, నిరుద్యోగులు అయితే కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్నారో.. అధికారం అప్పగించారో.. అదే ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. ఎంతలా అంటే.. తెలంగాణ గాంధీ అని పేరు పొందిన కేసీఆర్ ఏకంగా […]

Written By: NARESH, Updated On : February 16, 2021 6:35 pm
Follow us on

తెలంగాణను సాధించిన ధీరుడు.. ఉద్యమానికి ఊపిరిలూదిన యోధుడు.. సమాజాన్ని ఏకం చేసిన ఘనుడు.. తెలంగాణ తొలి సీఎంగా అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు చేరువైన నాయకుడు.. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. సీఎం  కేసీఆర్ గురించి ఉపమానాలు ఎన్నో.. కానీ ఏ ప్రజలు, నిరుద్యోగులు అయితే కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్నారో.. అధికారం అప్పగించారో.. అదే ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. ఎంతలా అంటే.. తెలంగాణ గాంధీ అని పేరు పొందిన కేసీఆర్ ఏకంగా తెలంగాణకు రాజధాని అయిన హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే ఎన్నికల్లో కనీసం పోటీ దిగడానికి కూడా సాహసించలేకపోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ భయపడేంతగా ఆ ఎన్నిక భయపెడుతోంది. పోటీకి వెనుకంజ వేస్తోంది. అధికార పార్టీలో ఉండి మరీ పోటీచేయడానికి వెనుకాడుతున్నాడంటే.. అంతకంటే దారుణమైన పరాభావం మరొకటి లేదని ప్రతిపక్షాలు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజాక్షేత్రంలో నిన్నటి వరకు కేసీఆర్ ఒక హీరో.. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఓటమి తర్వాత ఆయన జీరోలా మారిపోయారన్న చర్చ తెలంగాణలో సాగుతోంది. ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొన్న ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను, ఆయన పాలన తీరును ప్రజలు తిరస్కరించారు. ఆరేళ్లుగా ప్రజలను ఆకట్టుకున్న కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కాక పెడచెవిన పెట్టడంతో ఇలా కర్రు కాల్చి వాతపెడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోనే కేసీఆర్ పై ఇంత వ్యతిరేకత ఉందంటే.. ఇక తెలంగాణ వచ్చినా ఇంతవరకు విద్యావంతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ చేయలేని కేసీఆర్ పై వారిలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యావంతులకు ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే కేసీఆర్ వారితో పెట్టుకోవడం లేదు. తెలంగాణలో అధికార పార్టీ అయ్యి ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడానికి కేసీఆర్, టీఆర్ఎస్ భయపడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ పోటీచేస్తే చిత్తుగా ఓడించడానికి రెడీ అవుతున్న గ్రాడ్యుయేట్స్ కు అసలు ఆ అవకాశం ఇవ్వకుండా.. పోటీ చేయకుండా ఉండాలని కేసీఆర్ వెనక్కితగ్గడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  తెలంగాణలో నిరుద్యోగులకు ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు వారితో పెట్టుకోవడం లేదు. అలాగే వారే ఓటర్లుగా ఉన్న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయరాదని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి విద్యావంతులపై పోటీచేయడానికి కూడా సాహసించకపోవడం విశేషం. తెలంగాణలో అధికారంలో ఉన్న ఒక పార్టీ రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఒక ఎన్నికల్లో పోటీపెట్టకపోవడం అంటే అంతకంటే అవమానం ఇంకొకటి కాదంటున్నారు. విద్యావంతుల చేతిలో చావుదెబ్బ తినేందుకు.. తన ప్రత్యర్థులైన కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేతిలో ఓడిపోయేందుకు కేసీఆర్ సిద్ధంగా లేడు. అందుకే ముందే ఓటమిని అంగీకరించి వైదొలుగుతున్నాడట..

తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం  మరోసారి పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నారట..  వరంగల్-ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి రాబోయే శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయాలని కోదండరాం  భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ల మద్దతు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారట.. అన్నీ సరిగ్గా జరిగితే త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తాడని సమాచారం. కోదండరాంకు బిజెపి,  ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.

టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వరంగల్-ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదట్లో తన సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నప్పటికీ కోదండరాం మీద గెలవడం కష్టం కాబట్టి.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలలో ఓడిపోతే అది తనకు అవమానంగా ఉంటుందని డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.

శాసనమండలిలోకి ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న మరొక వ్యక్తి  ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీ అయిన నాగేశ్వర్ ఇప్పుడు మరోసారి బరిలో నిలవడానికి రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎంఎల్‌సిగా పదవీకాలం ముగిసిన తర్వాత తన అభిమాన జర్నలిజం రంగానికి తిరిగి వచ్చిన నాగేశ్వర్, మళ్లీ ఎన్నికలలో పోరాడాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగేశ్వర్ తత్వశాస్త్రం ద్వారా వామపక్షవాది అయినప్పటికీ ఆయన ఏపార్టీ తరుఫున పోటీచేయకుండా స్వతంత్రంగా పోటీచేసి అధికార , ప్రతిపక్షాల తప్పులను ఎత్తిచూపాలని.. ప్రజల తరుఫున మండలిలో గొంతుక వినిపించాలని అనుకుంటున్నాడట..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొదట్లో తన సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద గెలవడం కష్టం కాబట్టి.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలలో ఓడిపోతే అది తనకు అవమానంగా ఉంటుందని డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి, అధికారిక అభ్యర్థిని నిలబెట్టడానికి బదులుగా, టిఆర్ఎస్ పరోక్షంగా నాగేశ్వర్ కు మద్దతు ఇస్తుందని అంటున్నారు. నాగేశ్వర్ నిలబడితే ఖచ్చితంగా గెలుపు మేధావి అయిన ఈయనకే సొంతం అవుతుంది. అందుకే పోటీపడి ఓడిపోవడం కంటే ఒక మేధావికి మద్దతిచ్చి  పరువు కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడట..

టీఆర్ఎస్ వైదొలగడంతో  అటు కోదండరాం, ఇటు నాగేశ్వర్ గెలవడానికి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ ఇద్దరిపై అభ్యర్థులను పెట్టకూడదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే నిరుద్యోగులకు కేసీఆర్ భయపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలో ఉండి ఇలా వెనకడుగు వేసిన పార్టీ దేశంలో మరొకటి ఉండదని పలువురు దెప్పి పొడుస్తున్నారు.