
భారత బ్యాట్స్ మెన్ స్వదేశంలోనే పులులు.. అనేవారు గతంలో! అవును.. విదేశీ పిచ్ లపై, అక్కడి బౌలర్ల బంతులకు బ్యాట్ అడ్డు పెట్టి నిలబడడానికి కూడా కష్టపడేవారు. టాప్ ఆర్డర్ నుంచి టెయిలెండర్ వరకూ ఎవ్వరూ ఈ విమర్శకు అతీతులు కాకపోయేవారు. అయితే.. మధ్యలో కాస్త పరిస్థితి మారినట్టు కనిపించింది. కానీ.. ఇప్పుడు ఇంగ్లండ్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత బ్యాట్స్ మెన్ తీరు మళ్లీ.. పాత తరం సైకిల్ స్టాండ్ ను గుర్తుకు తెచ్చింది. నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు ఔటైన విధానం చూస్తే.. నిరక్ల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో.. సగటు అభిమాని తీవ్ర ఆవేదన, ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు.
టీ-20ల ప్రభావమో ఏమోగానీ.. టెస్టు మ్యాచ్ లో ఓపికతో బ్యాటింగ్ చేయడమే మరిచిపోయినట్టున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా వికెట్లు సమర్పించుకుంటూ వెళ్లిన తీరు చూస్తే.. పెవిలియన్ కు వెళ్లడానికి పోటీ పడినట్టుగా తోచింది. నిజానికి గత టెస్టు మ్యాచ్ లతో పోలిస్తే.. ఓవల్ పిచ్ పై పచ్చిక కూడా పెద్దగా లేదు. టీమిండియా బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయడానికి ఇంగ్లీష్ ఆటగాళ్లు పెద్దగా కష్టపడింది కూడా. వికెట్ నేనిస్తానంటే.. నేనిస్తాను అని భారత ఆటగాళ్లే సిద్ధంగా ఉన్నట్టు కనిపించిందంటే అతిశయోక్తి కాదు.
దారిలో ఒకచోట జారిపడ్డామంటే.. మరోసారి ఖచ్చితంగా చూసుకొని వెళ్తాం. తగిన జాగ్రత్తగా వ్యవహరిస్తాం. కానీ.. టీమిండియా ఆటగాళ్లు ఈ విషయాన్ని వదిలేసినట్టున్నారు. ఒకసారి ఔటైన విధానంలో.. మళ్లీ మళ్లీ ఔట్ కావడం.. వారి జాగ్రత్తకు అద్దం పడుతోంది. ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లోనూ ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతులకే పెవిలియన్ చేరిన కెప్టెన్ కోహ్లీ.. ఇప్పుడు నాలుగో టెస్టులోనూ అదే తరహాలో ఔట్ కావడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్లు కూడా ఇదేతరహాలోనే వెనుదిరిగారు.
ఓవల్ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 348 పరుగులు. అంటే.. ఇప్పటి వరకూ అక్కడ టెస్టు మ్యాచ్ ఆడిన ఏ జట్టైనా అన్ని పరుగులు చేసిందన్నమాట. కానీ.. కోహ్లీ సేన మాత్రం ముక్కీ మూలిగీ.. 191 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ విధంగా ఈ గ్రౌండ్ లో అత్యల్ప ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు చేసిన జట్టుగా భారత్ నిలిచిపోయింది. టీమిండియా ఆటగాళ్ల వీక్ నెస్ పసిగట్టిన ఇంగ్లీష్ బౌలర్లు.. ఆఫ్ స్టంప్ వైపు సంధించి, కావాల్సిన ఫలితం పొందారు. రోహిత్ నుంచి మొదలైన పరంపర.. పంత్ దాకా అదే పద్ధతిలో కొనసాగింది. అందరూ అనవసరంగా ఆఫ్ స్టంప్ బంతులను గెలికి ఔటైపోయారు.
టెస్టు క్రికెట్లో ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతులను ఎదుర్కోవడానికి మాజీ ఆటగాడు గవాస్కర్ చేసిన సూచన ఒక్కటే. వాటిని వదిలేయడమే అని అన్నాడు. అంటే.. దానికి బ్యాట్స్ మెన్ కు ఓపిక అవసరం. మరి ఓపిక లేదో.. తమ టాలెంట్ చూపించాలనుకున్నారోగానీ.. అందరూ ఆఫ్ సైడ్ బంతులను ముద్దాడి మరీ కీపర్, స్లిప్పులో క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ఇది నిజంగా ఇండియా జట్టేనా? అని డౌట్ ఫీలవుతున్నారు!