ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెదిరింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఏపీ ఎన్నికల పంచాయతీ తీవ్ర ఆరోపణలకు వేదికగా మారింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని, అందుకే ఎన్నికలంటే భయపడుతున్న వైసీపీ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి, ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నంలో ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు . ఇదే సమయంలో అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిని వైసీపీ ప్రభుత్వ కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.
అచ్చెన్నాయుడు సొంతగ్రామం అయిన నిమ్మాడలో దౌర్జన్యానికి పాల్పడ్డారని.. కింజారపు అప్పన్నను భయబ్రాంతులకు గురి చేశారని డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ క్లారిటీ ఇచ్చారు.. టీడీపీ నేతలు అనవసరంగా వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని స్వయానా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమారే ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకే అచ్చెన్నాయుడు అరెస్టు చేశామని మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు వైసీపీ భయపడడం లేదని అని పేర్కొన్న మంత్రి ధర్మాన.. టీడీపీ నేతలు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవి కప్పిపుచ్చడానికే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అచ్చెన్నాయుడు పోలీసులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తూ వారి అంతు చూస్తాం అని మాట్లాడుతున్నారు అంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యవహార శైలి సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. వైసీపీపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాన కృష్ణదాస్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి టీడీపీ నేతలు సహకరించాలని పేర్కొన్నారు.
ఇలా అచ్చెన్న అరెస్ట్ వెనుకున్నది నిమ్మగడ్డనే అన్న అసలు విషయాన్ని అదే జిల్లాకు చెందిన మంత్రి కృష్ణదాస్ పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.