వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారా..? తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం స్థాపించబోతున్నారా..? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించనున్నారని వార్తలు ఆనోటా.. ఈనోటా పాకడంతో హైదరాబాద్ లోని లోటస్ ఫౌండ్ కు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కొన్నాళ్లుగా వైసీపీలోనే ఉంటూ కామ్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నారు. కొత్త పార్టీపై షర్మిల ఏ విధమైన ప్రకటన చేయకుండానే కార్యకర్తలు ఇలా రావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
గత కొన్ని రోజుల కిందట ఓ దినపత్రికలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని కథనం ప్రచురించింది. అయితే అదంతా ఫేక్ న్యూస్ అంటూ షర్మిల స్వయంగా ఒక ప్రకటనలో కొట్టి పారేశారు. ఈ విషయంలో వైసీపీకి చెందిన కొందరు అయోమయానికి గురయ్యారు. వైఎస్ షర్మిల నిజంగానే పార్టీ పెడుతున్నారా..? అనే సందేహం కలిగింది. అయితే షర్మిల కొత్త పార్టీపై నేడో, రేపో ప్రకటన చేయనున్నారని ఊహాగానాలు బయటకి వచ్చాయి. అంతేకాకుండా తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించనుందని పలు వార్తలు వచ్చాయి. దీంతో వైఎస్ అభిమానులు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు లోటస్ ఫౌండ్ కు వస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తతం రాజకీయ అనిశ్చితి నెలకొందని తెలుస్తోంది. గత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపడుతోంది. ఈ తరుణంలో బీజేపీ కేవలం మతతత్వ పార్టీ అనే ముద్ర పడింది. దీంతో కొన్ని వర్గాలు బీజేపీకి దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ వర్గం టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కారణమైంది. అయితే గులాబీలోనూ రెడ్డీలు ఇమడలేకపోతున్నారు.
ఈ పరిస్థితిని గమనిస్తున్న కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు, కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న దిగ్గజ నేతలు, వైసీపీ కార్యకర్తలు తెలంగాణలో పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిలను కోరినట్లు తెలుస్తోంది. రేపే ఫిబ్రవరి 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల పెళ్లి రోజు రానుంది. ఈరోజున వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో లోటస్ ఫౌండ్ కార్యకర్తలతో కళకళలాడుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన షర్మిల విభజన తరువాత కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమయ్యారు. తెలంగాణలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తమ పార్టీ నాయకులను పోటీ చేయనివ్వలేదు. ఈ తరుణంలో షర్మిల ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం స్థాపన ఉంటుందుని వైఎస్ అభిమానులు భావిస్తున్నారు.