
కరోనా కారణంగా మూత‘బడి’న పాఠశాలలను తెరవడానికి తెలంగాణ సర్కార్ రెడీ అయ్యింది. స్కూళ్ల నిర్వహణపై కేసీఆర్ సర్కార్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేది నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహిచడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.
తాజాగా ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో శనివారం సమావేశమైన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం చదువులను పట్టాలెక్కించాలని కేసీఆర్ నిర్ణయించారు. టీకా కనుక అందరికీ అందుబాటులోకి వస్తే ఏప్రిల్, మే నెలల్లో అన్ని తరగతులను నిర్వహించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది.
ఇక రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు.
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని.. ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భరత్ీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు , వైకుంఠ ధామాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇలా వరుసబెట్టి తెలంగాణలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు సీఎం కేసీఆర్. వీటిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.