
రాణించడం లేదని విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ ఝలిపించాడు. సెంచరీతో కదం తొక్కాడు.. బ్యాటింగ్ భారాన్ని అంతా తనపై వేసుకున్నాడు. టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేశాడు. పిచ్ గింగిరాలు తిరుగుతున్న వేళ కఠినంగా మారిన పిచ్ పై సెంచరీ చేసి విమర్శకుల నోళ్లను రోహిత్ మూయించాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేసి విజృంభించడంతో తొలి రోజు టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది.
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. రోహిత్ కు వైస్ కెప్టెన్ రహానే 67 పరుగులతో తోడుగా నిలిచాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ 33, అక్షర్ పటేల్ 5 పరుగులతో ఉన్నారు.
టీమిండియాకు ఈసారి ఓపెనింగ్ కలిసిరాలేదు. టాస్ గెలిచిన ఆనందం ఎంతో సేపు లేదు. ఒక్క పరుగుకు కూడా జోడించకముందే ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను ఇంగ్లండ్ బౌలర్ స్టోన్ ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత పూజారా (21) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ కావడం టీమిండియాను భారీ దెబ్బతీసింది. పూజారా , కోహ్లీ వరుసగా ఔట్ కావడంతో రోహిత్, రహానే కలిసి చక్కదిద్దారు. ఇద్దరూ వీరోచితంగా పోరాడి టీమిండియాను నిలబెట్టారు. ఆఖర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో టీమిండియా 300 పరుగులకు 6 వికెట్లతో నిలిచింది.
అయితే ఇండియా భారీస్కోరు దిశగా కదులుతున్న వేళ చివరి సెషన్ లో వరుసగా రోహిత్, రహానే , అశ్విన్ లు ఔట్ కావడంతో ఇండియా స్కోరు వేగం తగ్గింది.కానీ చివర్లో పంత్ దూకుడుగా ఆడి స్కోరును 300 పరుగులకు చేరువ చేశాడు.
రేపు టీమిండియా కనీసం 400 పరుగులు చేస్తే మ్యాచ్ పై పట్టు బిగించే చాన్స్ ఉంటుంది. ఇంగ్లండ్ ను ఎంత త్వరగా ఔట్ చేస్తే మనకు అంత లాభం. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.