పూల సింగిడి.. తెలంగాణలో నేడే పూల పండుగ

‘‘రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. మూడు జాములాయె చందమామ.. పోవయ్యా దేవా ఉయ్యాలో.. లేవయ్యా పువ్వా ఉయ్యాలో..’’ తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. దేశమంతటా పూలతో దేవుళ్లను పూజిస్తే.. ఇక్కడి మహిళలు మాత్రం పూలనే దేవుళ్లుగా కొలుస్తుంటారు. తొమ్మిది రోజుల పండుగగా నిర్వహిస్తారు. అదే బతుకమ్మ పండుగ. Also Read: హైదరా‘బాధ’: ఎవ్వరినీ పలకరించినా కన్నీటి వరదే.! తెలంగాణ ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ […]

Written By: NARESH, Updated On : October 16, 2020 1:16 pm
Follow us on

‘‘రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..
ఒక్కేసి పువ్వేసి చందమామ.. మూడు జాములాయె చందమామ..
పోవయ్యా దేవా ఉయ్యాలో.. లేవయ్యా పువ్వా ఉయ్యాలో..’’

తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. దేశమంతటా పూలతో దేవుళ్లను పూజిస్తే.. ఇక్కడి మహిళలు మాత్రం పూలనే దేవుళ్లుగా కొలుస్తుంటారు. తొమ్మిది రోజుల పండుగగా నిర్వహిస్తారు. అదే బతుకమ్మ పండుగ.

Also Read: హైదరా‘బాధ’: ఎవ్వరినీ పలకరించినా కన్నీటి వరదే.!

తెలంగాణ ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబురాలు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలు కానున్నాయి. అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువుల, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వీధులన్నీ రంగుల పూలను సింగారించుకొని కొత్త శోభను తీసుకువస్తాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పడతుల వేడుక జరుపుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

తొమ్మిది రోజులపాటు పిల్లాపాపలకు సంతోషాన్నిచ్చే బతుకమ్మ వేడుకల్లో ఆడపిల్లలు, ముత్తయిదువులు ఒకరేమిటి ఇంటిల్లిపాదీ కలిసి చేసుకొనే వేడుక బతుకమ్మ. శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలతో ప్రారంభమై.. రోజుకో తిరుగా దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగిసిపోతాయి.

తొమ్మిది రోజులూ నిర్వహించనున్న పండుగలో భాగంగా రోజూ సాయంత్రం మహిళలంతా రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక దగ్గరకు చేర్చుతారు. బతుకమ్మల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ.. పాటలు పాడుతుంటారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ జీవన విధానం, ఆచారాలు, సంస్కృతి కలగలిపి ఉంటాయి. అలాగే.. బతుకమ్మల మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆ తల్లి తమ పసుపు, కుంకుమలను పదికాలాల పాటు చల్లగా చూడాలని మహిళల నమ్మకం.

బతుకమ్మకు తొమ్మిది రోజులకు తొమ్మిది పేర్లు ఉంటయి. రోజుకోరకం ప్రసాదం గౌరమ్మకు నైవేద్యంగా పెడుతుంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత వాటిని నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటారు.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్య రోజున బతుకమ్మ మొదటి రోజు వేడుక ప్రారంభమవుతుంది. దీన్ని పెత్రమాస అని కూడా అంటుంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: అశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నాన బియ్యం బతుకమ్మ: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశెలను అమ్మవారికి నైవేద్యంగా పెడుతారు.
అలిగిన బతుకమ్మ: ఈ రోజు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ: అశ్వయుజ అష్టమి రోజు.. దుర్గాష్టమిని జరుపుకుంటారు. అన్నంతో ఐదు రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. అవి పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నంతోపాటు సద్ద లడ్డూలు లేదా మలిద ముద్దలు నైవద్యంగా పెడుతారు.

Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. సులభంగా లక్షా 60 వేల రుణం!

బతుకమ్మ పండుగంటేనే బతుకునిచ్చే వేడుకగా తెలంగాణలో విశేష ప్రాముఖ్యం పొందిన వేడుక. చిన్నాపెద్దా అందరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. అమ్మవారి కటాక్షాన్ని, ఆ తల్లి దీవెనను ఆకాంక్షించిన మహిళలు, యువతులు, ఆడపడుచులంతా ఒకచోట చేరి చేసే సందడే ఈ బతుకమ్మ.