కరోనా లాక్ డౌన్ తో దేశంలో ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. ఉల్లి నుంచి సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడి నడ్డి విరుస్తున్నా కూడా మోడీ సర్కార్ కళ్లు ఉండి చూడలేని కబోధుల్లా తయారయ్యారని సామాన్యులు మండిపడుతున్నారు.
ధరాఘాతం సగటు మనిషి ఆదాయాన్ని పీల్చి పిప్పిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. సైలెంట్ గా రోజురోజుకు పెరుగుతున్న ధరలపై కనీసం ప్రతిపక్షాలు కూడా పోరుబాట పట్టకపోవడంతో వాటిని నియంత్రణపై కరువై సామాన్యులపై భారం పడుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల దేశంలో కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతు్న ధరల ప్రభావం ముందుగా హైదరాబాద్ పై పడుతోంది. సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ఎత్తుకు ధరలు చేరుకుంటున్నాయి.
దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికంగా ఉంది. పెట్రోల్ ధర ముంబై తర్వాత హైదరాబాద్ లోనే హైయెస్ట్ గా ఉంది. ఇప్పుడు ఆల్ టైం హై రికార్డును సైతం పెట్రోల్, డీజీల్ చేరుకున్నాయి.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15కి చేరింది. డీజిల్ రూ.82.80కి చేరింది.
విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్ మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగు చమురు సంస్థలు ఈ నెలలో రోజువారీగా ధరలను పెంచి వాత పెడుతున్నాయి. తాజాగా పెట్రోల్ పై రూ.2.10, డీజిల్ పై రూ.2.20 బాదేశాయి. తాజా పెంపుతో దేశంలోనే అత్యధిక ధరతో రికార్డు నమోదైంది.
ఇంత ధరలు పెరుగుతున్నా.. అంతర్జాతీయ ముడిచమురు ధర తక్కువకే దొరుకుతున్నా ప్రభుత్వాలు పన్నులతో సామాన్యుడిపై బాదేస్తున్నాయి. దీంతో ఎంత సంపాదించినా వీటికే ఖర్చు చేస్తూ కరోనా లాక్ డౌన్ అనంతరం సామాన్యుడు చితికిపోతున్నాడు. మోడీ సార్ ఇప్పటికైనా సామాన్యుడిని బతికించాలని పలువురు కోరుతున్నారు.