
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక్కసారిగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలోని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ భగ్గుమంది. అక్కడ ఆందోళనలు తగ్గడం లేదు.
ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ ఇరుకునపడింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. రాజకీయంగా దెబ్బ పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం పూనుకోవడం.. వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పడంతో బీజేపీ పెద్దలతో భేటికి పవన్ కళ్యాణ్ అర్జంట్ గా బయలు దేరి వెళ్లినట్లు తెలిసింది.
పవన్ కోరగానే ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ఆయన హస్తినకు బయలు దేరి వెళ్లినట్లు తెలిసింది.
రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చే పనిలో కూడా పవన్ పడ్డట్టు సమాచారం. ఈ క్రమంలో నడ్డాతో ఈ విషయం కూడా తేల్చుకోవడానికి పవన్ ఈ టూర్ ను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది.