
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీచేయాలనే దానిపై పీటముడి వీడింది. గత కొన్ని రోజులుగా మాకంటే మాకు అని కొట్టుకున్న బీజేపీ-జనసేనల పంచాయతీ ముగిసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీనే పోటీచేయనుంది. ఈ మేరకు చర్చలు కొలిక్కి వచ్చాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగి మరీ వెనక్కి తగ్గిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేస్తానంటూ మొన్నటిదాకా పట్టుబట్టాడు. కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షా సహా జేపీ నడ్డాను కలిసి ఒత్తిడి తెచ్చాడు. అయినా కూడా పవన్ కు సీటు దక్కలేదు. దీంతో మరోసారి త్యాగ పురుషుడిగా బీజేపీ ముందు నిలబడ్డ పవన్ ను చూసి జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.
తాజాగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్టు ఆ పార్టీ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న బీజేపీపై ఏపీ ప్రజల్లో పీకల్లోతు కోపం ఉంది. ఆ కోపంతో బీజేపీని ఖచ్చితంగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంత వేడిలో జనసేనను కాదని బీజేపీ సాహసం చేస్తుందనే చెప్పాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తేలిపోగా.. జనసేన మెజార్టీ సీట్లు సాధించింది. ప్రతిపక్షం టీడీపీతో సమానంగా సీట్లు దక్కించుకుంది. బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ సీటులో కనుక జనసేన పోటీచేస్తే ఆ ప్రభావం వేరుగా ఉండేది. కానీ బలం లేని బీజేపీ బరిలో ఉండడంతో జనసేన నాయకులు సైతం నిరాశ చెందుతున్నారు.
Comments are closed.