
రేపటి నుంచి క్రికెట్ ప్రేమికుల పండుగ ప్రారంభం కాబోతోంది. స్వదేశంలోనే ఈసారి ఐపీఎల్ జరగబోతోంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ పండుగ షురూ కానుంది. ఇప్పటికే ఆయా జట్లన్నీ ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం సన్నద్ధమవుతుండగా.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, కామెంటేటర్లు వారి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా వారి అంచనాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ ప్లే ఆఫ్ చేరే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదేనని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా ఫైవ్ టైమ్ చాంపియన్, పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే సత్తా కూడా హైదరాబాద్‌కే ఉందన్నాడు. గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. గత సీజన్ ఆరంభంలో తడబడినా.. చివర్లో చెలరేగి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్‌లో ఆ జట్టు ఫస్టాఫ్ మ్యాచ్‌లను చెన్నై, ఢిల్లీ వేదికగా ఆడనుంది. అయితే.. ఈ రెండు వేదికలు ఆరెంజ్ ఆర్మీకి కలిసొస్తాయని ఆకాశ్ చోప్రా చెప్పాడు.
‘సన్‌రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలీఫై అవుతుంది. అంతేకాకుండా ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్‌లో లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుకు నిలుస్తుంది. వారి తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో 6 లేదా ఏడు గెలిచే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ఫస్టాఫ్ మ్యాచ్‌ల వేదికలు వారికి కలిసి రానున్నాయి’ అని చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే దమ్ము, సత్తా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు గట్టి సవాల్ విసిరే జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. ముంబైతో ఆడే నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా హైదరాబాద్ రెండు గెలుస్తుంది’ అని చోప్రా పేర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముంబైని ఓడించే అవకాశాలున్నాయి. సన్‌రైజర్స్ సారథి, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో కూడా రాణిస్తాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఆరేంజ్ ఆర్మీ తరఫున ఈ ఆసీస్ స్టారే టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉందన్నాడు. ‘సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నరే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలుస్తాడు. కాకపోతే అతను మునపటిలా 150 స్ట్రైక్‌రేట్‌తో ఆడలేడు. కొంచెం నిదానంగా ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ అతను గత సీజన్ల మాదిరే 500 నుంచి 550 పరుగులు చేయగలడు’ అని చోప్రా చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఈ సీజన్‌లోనూ అదరగొడుతాడని చోప్రా అంచనా వేశాడు. హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకుంటాడని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే చెన్నై, ఢిల్లీ వేదికలపై అతను బంతితో చెలరేగుతాడన్నాడు. ‘రషీద్ ఖాన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకుంటాడు. ఫస్ట్ ఐదు మ్యాచ్‌లు చెన్నైలో, మిగతా నాలుగు మ్యాచ్‌లో ఢిల్లీలో జరగనున్నాయి. ఈ రెండు వేదికలు స్పిన్‌కు అనుకూలంతో దాంతో అతను సులువుగా ఈ 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయగలడు’ అని చోప్రా విశ్లేషించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడని, పవర్ ప్లేలో సత్తా చాటుతాడని తెలిపాడు. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ఫస్ట్ మ్యాచ్‌లో ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.