
కేంద్రంలో మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమలి ఎన్నికలపై ఊహగానాలు నడుస్తున్నాయి. ప్రధాని మోదీ సైతం పలుమార్లు తన ప్రసంగంలో జమిలి ఎన్నికల అవశ్యతను వివరించే ప్రయత్నం చేశారు.
ఈక్రమంలో కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ ప్రధాని హింట్ ఇచ్చారు. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం గతంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని వ్యాఖ్యలు చేసింది. దీంతో జమలి ఎన్నికలు ఉండకపోవచ్చనే టాక్ విన్పించింది.
అయితే తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా జమిలి ఎన్నికలకు మద్దతుగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే అంశంపై కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలో ప్రతీ ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతునే ఉన్నాయని.. దీని వల్ల పెద్దఎత్తున ధనం వృథా అవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం చాలావరకు ఆదా అవుతుందని తెలిపారు.
జమిలీ ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాతోపాటు ఇతర ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంట్లో చట్టసవరణ చేస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!