నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 46వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగు పరిశ్రమలోకి రాజకుమారుడుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి, మరెన్నో విజయాలు ఉన్నాయి. అందుకే, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేష్ బర్త్ డే మేనియానే కనిపిస్తోంది. మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు ట్విట్టర్ ని హోరెత్తిస్తున్నారు.
మరోపక్క సినీ ప్రముఖులు కూడా మహేష్ కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి పోటీ పడుతున్నారు. మరి తెలుగు సినిమాల్లో ప్రస్తుత ధ్రువతారగా వెలిగిపోతున్న మహేష్ సినీ ప్రస్థానాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే…. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తిరుగులేని స్టార్ గా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబుకి ఈజీగా ఇండస్ట్రీలో ఎంట్రీ దొరికింది.
అయితే, చిన్న తనంలోనే తన నటనతో మెప్పించిన మహేష్ కి హీరో అయ్యాక మాత్రం అంత ఈజీగా సక్సెస్ లు రాలేదు. ఏ సినిమా చేసినా ఏవరేజ్ దగ్గరే ఆగిపోయేది. కానీ, సినిమా సినిమాకి తన పరిధిని పెంచుకుంటూ తన సినీ కెరీర్ ను క్రమ శిక్షణతో అభివృద్ధి చేసుకున్నాడు మహేష్. ఓ దశలో వరుస డిజాస్టర్స్ తో డీలా పడినా.. ఆ తర్వాత తనను తానూ మార్చుకుంటూ చివరకు బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు.
తండ్రి కృష్ణకి తగ్గ తనయుడిగా మహేష్ కి అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిన సమయంలో కూడా.. మహేష్ తనదైన సినిమాలు మాత్రమే చేశాడు. ‘నాని, టక్కరి దొంగ’ అంటూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. మహేష్ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ మహేష్ ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారంటీ వసూళ్లను అందించిన హీరోగా కూడా మహేష్ కి మంచి గుర్తింపు ఉంది.
మహేష్ 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించారు. చిన్నతనంలో సమ్మర్ లో హాలిడేస్ రాగానే సినిమాల్లో నటించడం మహేష్ కి అలవాటుగా మారింది. ఆ అలవాటే మహేష్ లో నటుడిని మేల్కొలిపింది. అయితే, మహేష్ తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్న విధానం చూసి, కృష్ణ కూడా ఆశ్చర్యపోయారట. మహేష్ బాబు తన అన్నయ్య రమేష్ బాబు పరాజయాన్ని దగ్గర నుండి చూశారు.
కృష్ణ వారసుడిగా ఎంట్రీలోనే స్టార్ స్టేటస్ తో ఎంట్రీ ఇచ్చిన ‘రమేష్ బాబు’ స్టార్ కాలేకపోయారు. వరుస సినిమాలు చేసినా.. రమేష్ కి పరాజయాలే ఎదురయ్యాయి. అవన్నీ చూస్తూ ఎదిగిన మహేష్.. అనుభవాలతోనే మొదటి సినిమా నుండే.. తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వెళ్ళాడు.
మహేష్ కేవలం సినిమాలతోనే కాకుండా.. ఎన్నో సామాజిక సేవలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనకు ఎంత స్టార్ హోదా పెరిగినా.. ఎప్పుడూ ఒదిగే ఉండే మహేష్ కి మా ‘ఓకే తెలుగు’ నుండి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.