‘హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారిన పడడంతో గాంధీలో చికిత్స పొందారు. పూర్తిగా నయంకావడంతో ఆస్పత్రి సిబ్బంది అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయినా అతన్ని తీసుకెళ్లేందుకు ఆ కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. ఒకరోజు రెండ్రోజులు చూసినా స్పందన లేదు. చేసేదేం లేక తన స్వస్థలంలో ఇదివరకు తన దగ్గర పనిచేసిన పాలేరుకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. రాగానే అతని ఇంటికి వెళ్లిపోయారు. ’
Also Read: కొండగట్టు ఘటనకు రెండేళ్లు.. తండ్రి సమాధి వద్దే కూతురు
‘ఇదే మహానగరానికి చెందిన ఓ 76 ఏళ్ల వృద్ధుడు కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో తమ తండ్రి బతికి వస్తాడో రాడో అని అనుకున్న అతని కుటుంబంలోని ఓ సభ్యుడు వీలునామా రాయించుకునేందుకు ఏకంగా లాయర్‌తో హాస్పిటల్‌కు వచ్చాడు. ఆస్పత్రి వర్గాలు మందలించడంతో వెనక్కి వెళ్లిపోయాడు. అయినా పట్టువదలకుండా కాగితాలు తయారుచేసి లోపల ఉన్న వ్యక్తులతో పైరవీలు చేయించి మరీ సంతకం తీసుకున్నాడు. ఈ విషయాన్ని కరోనా నుంచి కోలుకున్నా స్వయానా ఆ వృద్ధుడే రోదిస్తూ తెలిపాడు.’
‘‘నవమాసాలు మోసి.. పురిటి నొప్పులను భరించి..
తన రక్తాన్ని పాలుగా మార్చి.. తల్లి తన బిడ్డ ఆకలి తీర్చుతుంది..
అదే తల్లి మలిసంధ్యలో ఒంటరవుతోంది.
అనురాగాన్ని పంచి.. అన్నీ తానై పెంచిన తండ్రి పిల్లలకు భారమవుతున్నాడు.
రెక్కలొచ్చిన పక్షుల్లా కన్నవాళ్లను వదిలేస్తున్నారు.
వృద్ధాప్యంలో కరోనా వేదన భరించలేదని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
అయిన వారు రాక.. హాస్పిటల్‌లోనే అనాథలుగా బతుకుతున్నారు.’’
‘‘బిడ్డకు దెబ్బతగిలితే కన్నతల్లి అయ్యో కొడుకా అని తల్లడిల్లుతుంది. పిల్లలు జీవితంలో ఎక్కడ వెనకబడి పోతారోనని తండ్రి అనుక్షణం తపిస్తాడు. ఇలా తమ కడుపున పుట్టిన వారి కోసం రాత్రింబవళ్లు కన్న పేగు ఆలోచిస్తూనే ఉంటుంది. చివరి మజిలీ వరకూ పిల్లల బాగోగులు కోరుతూనే ఉంటారు. కానీ.. ఇప్పుడు పండుటాకుల బతుకు దుర్భరంగా మారింది. మామూలుగానే అష్టకష్టాలు అనుభవించే వారు కరోనా సమయంలో మరింత మానసిన వేదనకు, అభద్రతాభావానికి గురవుతున్నారు. కన్న బిడ్డలే ఛీదరించుకుంటుంటే, దూరం పెడుతుంటే, కాదూ పొమ్మంటుంటే ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు.’’
మన దేశంలో 60 ఏళ్లకు మించిన వృద్ధులు 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 11 కోట్ల మంది ఉన్నట్టు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కూడా కావచ్చు. 1990లో ఐక్యరాజ్య సమితి చొరవతో వృద్ధుల కోసం ఒక ప్రణాళికను రూపొందించి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. దానికి అనుగుణంగా 1999లో మన భారత దేశంలో వృద్ధుల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆర్థిక భద్రత, ఆరోగ్య రక్షణ, నివాస వసతి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించారు. అయితే ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు. ఫలితంగా ఇంకా వారు నిరాదరణకు గురవుతూనే ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతలా హైరానా పెడుతోందో అందరికీ తెలిసిందే. మన దేశంలోనూ దాని విజృంభణ ఇంకా ఆగడం లేదు. ఈ కరోనా ఎక్కువగా వృద్ధులపాలిట శాపంలా మారింది. కరోనా వచ్చి మానవ సంబంధాలను పూర్తిగా విడదీసింది. కరోనా వచ్చిన వ్యక్తిని అంటురానివాడిలా చూడ్డం పరిపాటైంది. అది ఎంతలా అంటే సొంత తల్లిదండ్రులను కూడా దూరం పెట్టేంత. కొందరైతే కరోనా బారిన పడిన తమ తండ్రి ఎక్కడ చనిపోతాడోనని ఏకంగా ముందుగానే వీలునామాలు రాయించుకుంటున్నారు. వైరస్ వచ్చిన వృద్ధ తల్లిదండ్రులను హాస్పిటళ్లకు పంపిస్తున్న కొడుకులు.. వైరస్ నుంచి కోలుకున్నాక ఇంటికి తీసుకొచ్చేందుకు ముందుకు రావడం లేదు.
Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?
వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వారికి మనోధైర్యం కల్పించి.. వారిని అక్కున చేర్చుకోవాల్సిన సంతానం దూరం పెడుతోంది. రకరకాల కారణాలు చూపుతూ ఇంటికి తీసుకెళ్లడం లేదు. ఇప్పటికి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 25 మంది వృద్ధులు హాస్పిటల్‌లోనే ఉండిపోయారంటే మానవసంబంధాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ సంఖ్య 90 ఉండగా.. పదే పదే ఫ్యామిలీ మెంబర్స్‌కు హాస్పిటల్ నుంచి ఫోన్లు చేసే సరికి వచ్చి ఆ మాత్రం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ 25 మంది బాధ్యతను డాక్టర్లే చూస్తున్నారు. వీరి కోసం హాస్పిటల్‌లో ఓ డిపెండెంట్ వార్డును సైతం ప్రారంభించారు. పదే పదే హాస్పిటల్ నుంచి ఫోన్లు చేస్తున్నారని చెప్పి ఆ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
పుత్రరత్నాల వైఖరిని చూసి తట్టుకోలేక కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆ వృద్ధులకు మనో వేదన తప్పట్లేదు. ఇన్నేళ్లు గారాబంగ పెంచిన తమ పిల్లలే తమను ఇలా నిరాకరిస్తున్నారని రోదిస్తున్నారు. ‘దేవుడా.. ఎందుకు మాకు ఇలాంటి దుస్థితి కల్పించావ్. కరోనా వచ్చినప్పుడే మమ్మల్ని కూడా నీ దగ్గరికి తీసుకెళ్తే అయిపోవు కదా’ అని కంటతడి పెట్టుకుంటున్నారు. ముసలితనంలో కొడుకులకు, కూతుళ్లకు భారమయ్యామే అని డాక్టర్లకు చెప్పుకుంటూనే డిపెండెంట్ రూమ్‌లో ఉండిపోతున్నారు.
-వాసు
Note: Views expressed by author are his own, not of publishers
రచయిత అభిప్రాయాలు తన వ్యక్తిగతం, ప్రచురణ కర్తలకు చెందినవి కావు