
ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చినప్పుడు.. చాలామంది రాజకీయ నాయకులు చాలా రకాల విమర్శలు చేసారు. మొహానికి రంగు వేసుకునే వాడు రాజకీయ రంగు ఏమి మారుస్తాడు అంటూ చులకన చేసే ప్రయత్నం చేశారు. కానీ, 1983 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయం ఒక చరిత్ర అయింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆ విజయం అత్యున్నత ఘట్టం అయింది. అయితే, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు అది.
ఆ రోజు ఎన్టీఆర్ గారి కోసం మహామహులు ఎదురుచూస్తున్న సమయం అది. కానీ ఎన్టీఆర్ గారు ఒకరికి కబురు పంపడానికి అప్పటికి చాలా సమయం నుండి టెన్షన్ పడుతున్నారు. చివరకు తనకు కావాల్సిన ఆ వ్యక్తికి ఎన్టీఆర్ కబురు పంపారు. ఇంతకీ ఎవరూ ఆ వ్యక్తి అని రాజకీయ దిగ్గజాలు కూడా ఆలోచనలో పడ్డాయి. కట్ చేస్తే.. మరుసటి రోజు మద్రాసు నుండి నాగిరెడ్డిగారు దిగారు.
ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళేప్పుడు తన కారులోనే నాగిరెడ్డిగారిని స్వయంగా ఎక్కించుకుని వెళ్ళారు. నిజానికి ఆ సమయంలో నాగిరెడ్డిగారు ప్రముఖ వ్యక్తి కాదు. అప్పటికే ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా పూర్తిగా పట్టు కోల్పోయారు. అయినా ఎన్టీఆర్ గారు ఎందుకు నాగిరెడ్డిగారికి అంత మర్యాద ఇస్తున్నారు ? అంటూ చుట్టూ ఉన్నవాళ్లు.. వాళ్లల్లో వాళ్లే గుసగుసలు ఆడుకుంటున్నారు.
కానీ, ఎన్టీఆర్ మాత్రం నాగిరెడ్డిగారిని ప్రమాణ స్వీకారమయ్యాక నేరుగా సెక్రటేరియేట్ కీ కూడా తన పక్కనే కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తరువాత గాని.. ఎదురుగా నాగిరెడ్డిగారితో అసలు విషయం చెబుతూ… ‘ఒకప్పుడు మీరిచ్చిన చేయూత వల్లనే నేనింతవాడినయ్యాను. ఈ విజయం కారణ బిందువు మీరే. ఈ విజయం
మీదే.మా చేత మంచి పాలన తెలుగువాళ్ళకు ఇప్పించండి అంటూ లేచి నమస్కరించారట.
ఆహా.. ఎన్టీఆర్ గారిలో ఆ కృతజ్ఞతాభావానికి అభిమానులు కాకుండా ఎవరు ఉండగలరు. అందుకే, నాగిరెడ్డిగారు కూడా చకితులై హర్షబాష్పాలతో లేచి ఎన్టీఆర్ గారిని కౌగలించుకున్నారట. కృతజ్ఞత అనే భావానికి ఎన్టీఆర్ గొప్ప నిర్వచనం ఇచ్చారు.