‘కాసు’పత్రుల కరోనా దోపిడీ

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాలో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ వైరస్‌ అటు ఆరోగ్యపరంగానూ.. ఇటు ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఒకే కుటుంబంలో ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. బలైపోతుండడంతో బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలని పొలమో, ఇల్లో, బంగారమో అమ్మేసి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని కుటుంబాలు చూస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులు నిలువునా దోచుకుంటున్నాయి. లక్షలు కుమ్మరించినా చివరకు డెడ్‌ బాడీలే ఇస్తుండడంతో .. ‘దేవుడా.. ఎందుకయ్యా మాకు ఇలాంటి దుస్థితి కల్పించావు’ అంటూ […]

Written By: NARESH, Updated On : September 27, 2020 6:22 pm

hos copy

Follow us on


ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాలో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కొవిడ్‌ వైరస్‌ అటు ఆరోగ్యపరంగానూ.. ఇటు ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఒకే కుటుంబంలో ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. బలైపోతుండడంతో బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలని పొలమో, ఇల్లో, బంగారమో అమ్మేసి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని కుటుంబాలు చూస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులు నిలువునా దోచుకుంటున్నాయి. లక్షలు కుమ్మరించినా చివరకు డెడ్‌ బాడీలే ఇస్తుండడంతో .. ‘దేవుడా.. ఎందుకయ్యా మాకు ఇలాంటి దుస్థితి కల్పించావు’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అంతేకాదు.. రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు బలైన వారూ ఉన్నారు. కుటుంబ పెద్దలను బలిగొన్న వైరస్.. చాలా చోట్ల పిల్లలను అనాథల్ని చేసింది. అటు ఆర్థికంగానూ.. ఇటు కుటుంబ పరంగానూ భరోసా కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి..? తలచుకుంటేనే ఏదోలా ఉంది కదూ..!

Also Read: వ్యవసాయ‘బిల్లు’ తెచ్చిన చేటు.. 23 ఏళ్ల బంధానికి బ్రేకప్‌

‘‘ఖమ్మంలోని ఓ వ్యాపారి కుటుంబంలో 12 మంది కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కొందరు మూడు నాలుగు రోజులకే ఇంటికి చేరగా.. మరికొందరు 10 రోజులపాటు ఉండాల్సి వచ్చింది. వీరందరి కోసం రూ.30 లక్షల వరకూ ఖర్చయింది. అంత ఖర్చు పెట్టిన పెద్ద ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది.’’

‘‘వరంగల్‌కు చెందిన ఓ ఫొటో జర్నలిస్టుకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌‌పై చికిత్స చేయాల్సి వచ్చింది. బిల్లు ఏకంగా రూ.28 లక్షలైంది. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది.’’

‘‘ఆదిలాబాద్‌లోని ఓ ఉమ్మడి కుటుంబంపై కరోనా పగబట్టింది. 8 మంది కుటుంబసభ్యుల్లో ఏడుగురు వైరస్‌ బారిన పడ్డారు. అన్నదమ్ములిద్దరి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఒకరిని నాగపూర్‌‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో, మరొకరిని ఆదిలాబాద్‌లో చేర్పించారు. 10 రోజుల వ్యవధిలో ఇద్దరూ కన్నూమూశారు. వైద్యం కోసం రూ.6 లక్షలకు పైగా అప్పు చేశారు. సంపాదించే ఆ ఇద్దరినీ కోల్పోవడంతో ఇప్పుడు అప్పులెలా కట్టాలో తెలియక ఆ కుటుంబం ఆగమాగం అవుతోంది.’’

‘‘మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. ఆ తర్వాత ఇంట్లోని ముగ్గురు చిన్నారులకూ పాటిజివ్‌ వచ్చింది. తర్వాత తండ్రి, తమ్ముడికి అంటుకుంది. చిన్నారులు కోలుకోగా.. తండ్రీకొడుకుల పరిస్థితి సీరియస్‌గా మారింది. వీరిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల కింద తండ్రి చనిపోగా.. పెద్దకర్మ చేసిన రోజే కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. మరో నాలుగు రోజుల్లో మరో కొడుకు చనిపోయాడు. ఇలా 20 రోజుల తేడాతోనే తండ్రి, ఇద్దరు కొడుకులను కరోనా మింగేయడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ట్రీట్‌మెంట్‌ కోసం ఏకంగా రూ.కోటి వరకు ఖర్చు చేశారు.’’

Also Read: ప్రభుత్వరంగ వ్యవస్థలను చంపేస్తున్నదెవరు?

‘‘సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో కరోనాకు తల్లీకొడుకులు బలయ్యారు. జులైలో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి నెట్టబడింది. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ చేనేత కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఏడుగురు సభ్యులు ఉండగా.. నిరుపేదల కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తమ దగ్గర బట్టలు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.’’

తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వందలు.. వేల సంఖ్యలో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు కాస్త ‘కాసు’పత్రులుగా మారాయి. కనీస మానవత్వం కూడా లేకుండా లక్షలకు లక్షల బిల్లులు వేస్తూ.. ‘శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాయి.’ ప్రభుత్వం నామమాత్రంగా ప్రైవేటు ఆస్పత్రులకు ధరలు నిర్ణయించినా.. ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. సాక్షాత్తు హైకోర్టు మందలించినా వాటి తీరులో మార్పు రావడం లేదు.

కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం రాష్ట్రంలో ప్రభుత్వం 45 జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో 8,903 బెడ్స్‌ సిద్ధం చేసింది. వాటిలో 2,584 పడకలు మాత్రమే నిండాయి. అంటే 31.92 శాతమే. కానీ.. రాష్ట్రంలోని  233 ప్రైవేటు హాస్పిటల్స్‌లో కొవిడ్‌ చికిత్స కోసం 11,055 బెడ్స్‌ అందుబాటులో పెట్టగా.. వాటిలో 4,062 బెడ్స్‌ల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. అంటే  36.74 శాతం పడకలు ఫుల్‌ అయ్యాయి. కానీ.. కార్పొరేట్‌ ఆస్పత్రులు చెబుతున్న లెక్కల ప్రకారం మాత్రం 60 నుంచి 70 శాతం వరకు బెడ్స్‌ నిండిపోయి ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో 167 బెడ్స్‌ ఉంటే.. 154 నిండిపోయాయి. హైటెక్‌ సిటీలోని మరో హాస్పిటల్‌లో 205 బెడ్స్‌ ఉంటే 186 ఫుల్‌ అయ్యాయి. ఈ లెక్కలన్ని బట్టి చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోతోంది రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ స్థాయి డేంజర్‌‌లో ఉందనేది.

ఏ ఆస్పత్రిలోనూ కరోనా చికిత్స అందించినా.. రోజుకు ఐసోలేషన్‌లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్‌‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ.9,000 వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  కానీ.. ఈ ఉత్తర్వులు ఏ ఆస్పత్రిలో అమలువుతున్నాయి..? ప్రభుత్వ ధరలను అమలు చేయడం ఏమోకానీ ధరలను మరింత పెంచేసి వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ దోపిడీపై సీఎం కేసీఆర్‌‌ ఈ మధ్య అసెంబ్లీలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని కూడా నియమించారు. అయినా.. ఎక్కడా పెద్దగా మార్పు లేదు. ఒకట్రెండు ఆస్పత్రులకు పర్మిషన్‌ రద్దు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ధరల విషయాన్ని మరిచింది.

Also Read: ఏపీలోకి అక్రమ మద్యం ప్రవాహం.. కాదేది అనర్హం!

ఈ కార్పొరేట్‌ ఆస్పత్రుల పరిస్థితి ఇలా ఉంటే.. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఆగమాగం అయ్యాయి. సీరియస్‌గా ఉంటేనే ఆస్పత్రులకు రావాలని.. లేదంటే హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాలంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నంత కాలం పెద్దగా సమస్య లేకున్నా.. ఒక్కోసారి పరిస్థితి సీరియస్‌ అవుతోంది. దీంతో తమ వాళ్లను బతికించుకునేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు పరుగుపెడుతున్నారు.

ఇంట్లో ఒకరు చనిపోతేనే ఆ విషాదం ఏళ్ల పాటు వేధిస్తూనే ఉంటుంది. అలాంటిది ఒకే కుటుంబంలో రోజుల తేడాతోనే ఇద్దరు ముగ్గురు చనిపోతే అది మాటలకందని విషాదమే అని చెప్పాలి. ఇంత జరుగుతున్నా..‘ఏదైనా మన ఇంట్లో జరిగే వరకు తెలియదు’ అన్నట్లు వ్యవహరిస్తోంది రాష్ట్ర సర్కార్‌‌. కరోనాతో చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ మాయదారి కరోనాతో ఇంకా ఎందరు చనిపోవాల్నో..? ఇంకా ఎన్ని కుటుంబాలు ఆగం కావాల్నో..? పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది.

-శ్రీనివాస్