ప్రధాని నరేంద్రమోడీ వెనక్కి తగ్గడం లేదు. కొత్త సాగు చట్టాలపై రెండు నెలలకు పైగా రైతులు రోడ్డెక్కి నానా యాగీ చేస్తున్న కరగడం లేదు. ఇప్పటికే రాజ్యసభలో కుండబద్దలు కొట్టిన ప్రధాని నరేంద్రమోడీ.. తాజాగా లోక్ సభలోనూ అదే పాట పాడారు. కొత్త సాగు చట్టాలపై అదే కఠినత్వం చూపారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ లోక్ సభలో సుధీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్ధానికి మార్గనిర్ధేశనం చేసిందని మోడీ కొనియాడారు. కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదిరిస్తోందని మోడీ అన్నారు. కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపిస్తున్నామన్నారు. కరోనాపై విజయం దేశప్రజలదన్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా? సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర దక్కలేదా? అని ఎదురు ప్రశ్నించారు.
కొత్త సాగు చట్టాలపై ఏ రైతుకు నష్టం జరగదని మోడీ కుండబద్దలు కొట్టారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎందుకు చేస్తామని నిలదీశారు. సాగు చట్టాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దశాబ్ధాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు లేవని.. తాము చేస్తున్నామని మోడీ అన్నారు.. రైతుల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విమర్శించారు.