భారత్‌లో ప్రై‘వేటు’కు ద్వారాలు

‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాం. ఇప్పుడు కూడా కేంద్రంలో అవే ఒడిదుడుకులు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌‌ ఉన్నదంతా కార్పొరేట్లకు ఊడ్చిపెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన నవరత్నాలను పూర్తిగా నిర్వీర్యం చేసి.. డబ్బున్నోళ్ల కబంధహస్తాల్లోకి నెట్టేసి.. దేశ ఆర్థిక వ్యవస్థ సమూల నాశనం కోసం ధ్వంసరచన చేస్తున్నట్లుగా రాజకీయ నిపుణులు వాపోతున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడానికి […]

Written By: NARESH, Updated On : February 14, 2021 8:55 am
Follow us on

‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాం. ఇప్పుడు కూడా కేంద్రంలో అవే ఒడిదుడుకులు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌‌ ఉన్నదంతా కార్పొరేట్లకు ఊడ్చిపెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన నవరత్నాలను పూర్తిగా నిర్వీర్యం చేసి.. డబ్బున్నోళ్ల కబంధహస్తాల్లోకి నెట్టేసి.. దేశ ఆర్థిక వ్యవస్థ సమూల నాశనం కోసం ధ్వంసరచన చేస్తున్నట్లుగా రాజకీయ నిపుణులు వాపోతున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడానికి నరేంద్రమోదీ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నది. మోదీ సర్కారు చర్యలు ఆయా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, బీహెచ్‌ఈఎల్‌, విద్యుత్‌, ఎల్‌ఐసీ, విమానయానం, రక్షణ.. ఇలా ఏ రంగం చూసినా ఛిన్నాభిన్నం చేయడమే మోదీ సర్కారు లక్ష్యంగా కనపడుతున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు.’’

‘‘అధికారంలోకి రావడానికి ముందు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకించి మన్మోహన్‌సింగ్‌ సర్కారుపై విరుచుకుపడిన నరేంద్రమోదీకి.. ఆయన పార్టీ బీజేపీకి ఇప్పుడు అదే ప్రక్రియ బెల్లంగా మారింది. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుసేరుగా అమ్మేయడానికి తెగబడింది. తోపుడు బండిపై హరేక్‌మాల్‌ అన్న చందాన ఎంత వీలైతే అంత మేరకు అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నది. 50 శాతం పైగా ఉన్నవాటాలను 49 శాతానికి పరిమితం చేసి.. యాజమాన్య హక్కును నిస్సిగ్గుగా వదిలించుకోవాలని చూస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సేకరించాలని సంకల్పించింది. కానీ.. ప్రభుత్వ లక్ష్యానికి కోవిడ్‌ గండికొట్టింది. ఈ ఏడాది బీపీసీఎల్‌ (ప్రభుత్వ వాటా 52.98 శాతం), ఐడీబీఐ బ్యాంక్‌ (47.1శాతం), కాంకర్‌ (30.8శాతం), షిప్పింగ్‌ కార్పొరేషన్‌ (63.75శాతం), బీఈఎంఎల్‌ (54.03శాతం)లను సైతం అమ్మకానికి పెట్టిందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా పీఎస్‌యూ మార్గదర్శకాలనే సమూలంగా మార్చేసింది. తద్వారా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి తేలికగా విడిచిపెట్టడానికి రాజమార్గం ఏర్పాటుచేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.’’

ఎన్డీయే హయాంలో వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ
దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ 1991లో మొదలైనప్పటికీ.. 1996లో వేగం పుంజుకున్నది. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు ఏడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం పదేండ్లలో మూడు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. పెద్దపెద్ద ఉపన్యాసాలు దంచి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఆరేండ్లలో ఏకంగా 23 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. పలు సంస్థల్లో 50 శాతానికంటే తక్కువకు ప్రభుత్వ వాటా తగ్గించుకున్నారు.

బీమాకు బీమారీ..
ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ‘భారత జీవితబీమా సంస్థ’. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు ఇందులో బీమా చేసి జీవితంపై హాయిగా ఉన్నారు. లక్షల మంది ప్రజలకు, ఉద్యోగులకు, ఏజెంట్లకు, డెవలప్‌మెంట్‌ సిబ్బందికి పెద్దమొత్తంలో ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఎల్‌ఐసీ. దేశంలో ఎల్‌ఐసీ అంటే బీమాకు పర్యాయ పదమైపోయింది. ఇంతటి బీమా దిగ్గజ సంస్థను సైతం ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం కంకణం కట్టుకున్నది. సంస్థలో దశలవారీగా 10శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా భారీగా నిధులను సమకూర్చుకోవచ్చన్న దురాశతో ఉన్నది. అయితే కరోనా ఉద్ధృతి, మార్కెట్లు నిరుత్సాహకరంగా ఉండటంతో ఎల్‌ఐసీలో వాటా విక్రయ ప్రతిపాదనను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. దేశాభివృద్ధిలో, ప్రజల సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎల్‌ఐసీ ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సరికావని ఇన్సురెన్స్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు.

భెల్‌కు కేంద్రం చీడ
‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు’ భరతజాతి సంపదతో.. చిన్న సంస్థగా ఆవిర్భవించి.. ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన దేశీయ పరిశ్రమల మకుటంలో మహారత్నంగా నిలిచిన సంస్థ బీహెచ్‌ఈఎల్‌ (భెల్‌). ఇప్పుడు దీనిపై మోదీ సర్కారు పడగనీడ పడిందని ఆ సంస్థ ఉద్యోగులు అంటున్నారు. తన అనుకూల తాబేదారులకు ప్రతిష్ఠాత్మక సంస్థను ధారాదత్తం చేసేందుకు ఎన్డీయే సర్కారు కుయుక్తులు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భెల్‌కు ఎలాంటి ఆర్డర్లను ఇవ్వకుండా సంస్థ ప్రగతికి ప్రతిబంధకాలను సృష్టిస్తున్నదని సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. థర్మల్‌ బాయిలర్ల ఉత్తత్తిపై ఆంక్షలు విధించిందంటున్నారు. పరోక్షంగా సంస్థను నష్టాల పాల్జేసి.. దానిని సాకుగా చూపుతూ అనుకూల కార్పొరేట్‌ శక్తులకు సంస్థను, వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా అప్పగించాలని చూస్తున్నదని వివరిస్తున్నారు. అదే జరిగితే భారీ విద్యుత్‌ పరికరాల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న ఆ సంస్థ విజయప్రస్థానం ముగింపు దశకు చేరుకున్నట్టే. భెల్‌లో సుమారు 9 వేల మంది ఇంజినీర్లు, 33,752 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వారు కాకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా మరో 6,0-80 మంది ఉపాధి పొందుతున్నారని కార్మిక సంఘాల నేతలు వివరిస్తున్నారు.

రైల్వే సంస్థలపై ప్రై‘వేటు’
2014కు ముందు ఎన్నికల ప్రచారంలో ‘నేను రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్నానే తప్ప దేశాన్ని అమ్మను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఇప్పుడు రైల్వే సంస్థలనూ కేంద్రం వదలడం లేదు. గతేడాది రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌లో 12శాతం వాటా విక్రయానికి కొనుగోలుదారుల నుంచి లభించిన విశేష మద్దతుతో మరో మూడు సంస్థల్లో వాటా విక్రయానికి శ్రీకారం చుట్టింది. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఐఆర్‌సీవోఎన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఇందులో ఉన్నాయి. దీంట్లో ఐఆర్‌సీవోఎన్‌లో 15శాతం వాటాను విక్రయించడానికి సిద్ధమైందని రైల్వే ఉద్యోగులు మోదీ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం ప్రత్యేక ప్రతిపత్తితో ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రైల్వేశాఖను నిర్వీర్యం చేయడం కోసమే సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడమే కాకుండా.. రైల్వేశాఖలోని ఒక్కో అంగాన్ని నిర్వీర్యం చేస్తూ అమ్మకానికి పెట్టారు. 150 రైళ్లను అమ్మడానికి ఇప్పటికే బిడ్లను ఆహ్వానించారు. 150 రైల్వే స్టేషన్లను ప్రైవేట్‌కు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. 109 ట్రాక్‌రూట్లను కూడా ప్రైవేట్‌పరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బడ్జెట్‌ అంటే అమ్ముకోవడమా?
బడ్జెట్‌ అంటే ఆదాయం స్వయంగా పెంచుకొని చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం పలు ఉత్పాదక వ్యవస్థలను పెంపొందించుకోవాలి. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలను సమాంతరంగా అభివృద్ధి చేసుకొంటూ వృద్ధిరేటును పెంచుకోవాలి. కానీ.. మోదీ ప్రభుత్వానికి ఆర్థికరంగంలో ఎలాంటి ముందుచూపులేదు. దార్శనికత అసలే లేదు. అయితే రాముడు.. లేకపోతే పాకిస్తాన్‌.. అదీ కాకుంటే చైనా.. వీటన్నింటికీ మించి విదేశాల్లో పల్లకిమోతలు.. సమాజంలో భావోద్వేగం ఎప్పటికీ చల్లారకుండా చూసుకోవడం.. ఓట్లు కొల్లగొట్టడం.. ఇంతకుమించి ఆరేండ్లలో ఈ దేశం ఆర్థిక స్వయంసమృద్ధి పొందడానికి చేసింది ఏమీలేదు. ప్రభుత్వపరంగా తాము చేయకపోగా.. చక్కగా నడుస్తున్న వాటిని విధ్వంసం చేస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహిస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు వీధిపాలు
దేశంలో టెలిఫోన్‌తో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో అనుబంధం ఉన్నది. అలాంటి బీఎస్‌ఎన్‌ఎల్‌ను అంబానీ జియో కోసమో.. మరో కార్పొరేట్‌ దిగ్గజం కోసమో తాకట్టుపెట్టారని ఆ సంస్థ ఉద్యోగులు మోదీ సర్కారుపై ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్‌కు అప్పజెప్పడం కోసం సంస్థను నిర్వీర్యం చేయడంలో భాగంగా 92 వేల మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ ఇచ్చి మరీ పంపించారు. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌తో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంది. దాన్ని నిలబెట్టేందుకు ఏండ్లుగా ఉద్యోగులు శాయశక్తులా కష్టపడ్డారు. ఇప్పుడు కేంద్రం ప్రైవేటీకరిస్తే ఉద్యోగుల బతుకులు రోడ్డున పడుతాయి.

ఎన్డీయేలోనే ఎక్కువ..
1991 నుంచి చూస్తే మొత్తం రూ.3.63 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా.. వాటిలో రూ.2.1 లక్షల కోట్ల ఉపసంహరణలు ఎన్డీయే-–1 పాలనలోనే మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. యూపీఏ హయాంతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు. ఎన్డీయే–1 హయాంలో 9 అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఐటీడీసీ హోటళ్లు విక్రయించి రూ.5,544 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ విక్రయం విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ సంస్థకు చెందిన 51శాతం వాటాలను అనిల్‌ అగర్వాల్‌ వేదాంత గ్రూప్‌నకు రూ.551కోట్లకు విక్రయించింది కేంద్రం.

ఇలా వర్గీకరించారు..
సంస్థల విక్రయాన్ని, నిధుల ఉపసంహరణకు వ్యూహాత్మక సంస్థలు, వ్యూహాత్మకం కాని సంస్థలుగా వర్గీకరించారు. వ్యూహాత్మక రంగంలో ప్రస్తుతానికి 18 సంస్థల్ని గుర్తించింది ప్రభుత్వం. వాటిలో బ్యాంకింగ్‌, బీమా, స్టీలు, ఎరువులు, ముడిచమురు, గ్యాస్‌, రక్షణ పరికరాల ఉత్పత్తి, అణు ఇంధనం, అంతరిక్షం, రవాణా, టెలికం, విద్యుత్‌, బొగ్గు, ఇతర ఖనిజాలు, నౌకా నిర్మాణం, విమానాశ్రయాలు, అభివృద్ధి నిర్వహణ, పోర్టులు, హైవేలు, కాంట్రాక్టు నిర్మాణం, సాంకేతిక సహకార సేవలు, ఆర్థిక సేవలకు వీటిలో చోటు కల్పించారు. ఇకపై కేవలం ఈ రంగాలల్లోని సంస్థల్లోనే ప్రభుత్వం యాజమాన్య హోదాలో కొనసాగనుండగా.. మిగిలిన వాటాలను విక్రయించనుంది.

వాటాల ఉపసంహరణకు కేంద్రం ఆమోదించిన సంస్థలు
* ప్రాజెక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా
* హిందుస్థాన్‌ ప్రెఫబ్‌
* ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌
* బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కో. ఇండియా
* హిందుస్థాన్‌ న్యూస్‌ప్రింట్‌ (అనుబంధ సంస్థ)
* స్కూటర్స్‌ ఇండియా
* భారత్‌ పంప్స్‌, కంప్రెషర్స్‌
* సిమెంట్‌ కార్పొరేషన్‌
* హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్‌
* సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌
* భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌
* ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ (అనుబంధ సంస్థ)
* నగర్నర్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆఫ్‌ ఎన్‌ఎండీసీ
* సెయిల్‌ దుర్గాపూర్‌, భద్రావతి స్టీల్‌ ప్లాంట్లు
* పవన్‌ హన్స్‌
* హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌
* ఎయిర్‌ ఇండియా, దాని 5 అనుబంధ సంస్థలు
* ఇండియన్‌ మెడిసిన్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌
* కామరాజర్‌ పోర్ట్‌
* టూరిజం అభివృద్ధి సంస్థ
* కర్ణాటక యాంటీబయాటిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌
* హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌
* బెంగాల్‌ కెమికల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌

20 ఏళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చరిత్ర
* 1999–-2004 వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.24,620 కోట్లు
* ఓఎన్జీసీలో 10శాతం వాటా అమ్మకం.. రూ.10,542 కోట్లు తొలిసారి ప్రైవేట్‌ సంస్థలకు విక్రయం
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఐపీసీఎల్‌లోని 26 శాతం వాటా రూ.1,491 కోట్లు
* టాటా కమ్యూనికేషన్స్‌కు వీఎస్‌ఎన్‌ఎల్‌లోని 25 శాతం వాటా రూ.1,439 కోట్లు
* సూజుకీకి మారుతీ ఉద్యోగ్‌లోని 27.5శాతం వాటా రూ.993 కోట్లు
* స్టెరిలైట్‌కు హిందుస్థాన్‌ జింక్‌ 22.1 శాతం వాటా రూ.445 కోట్లు
* టీసీఎస్‌కు సీఎంసీలోని 51 శాతం వాటా రూ.152 కోట్లు
* 2004–-09 వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.8,516 కోట్లు
* ప్రభుత్వం తెచ్చిన కొన్ని ఐపీవోలు ఎన్టీపీసీ రూ.2,684 కోట్లు 5.3 శాతం వాటా విక్రయం
* పవర్‌గ్రిడ్‌ రూ.995 కోట్లు 4.6 శాతం వాటా అమ్మకం
* ఆర్‌ఈసీ రూ.820 కోట్లు 9.1% వాటా విక్రయం
* 2009–-14 వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.1,05,529 కోట్లు
* 2013–-14లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను కేంద్రం పరిచయం చేసింది. తొలి విడుతలో రూ.3,000 కోట్ల నిధులను సమీకరించారు
* 2010లో కోల్‌ ఇండియా ఐపీవో 10శాతం వాటా అమ్మకం ద్వారా రూ.15,199 కోట్ల రాక
* ఎస్‌యూయూటీఐ ద్వారా తొలి పెట్టుబడుల ఉపసంహరణ
* యాక్సిస్‌ బ్యాంక్‌లో 9 శాతం వాటా అమ్మకం రూ.5,500 కోట్ల సమీకరణ
* 2014–-19 వాటాల విక్రయం ద్వారా సమీకరించిన మొత్తం రూ.2,80,490 కోట్లు
* భారత్‌ 22 ఈటీఎఫ్‌ ద్వారా 22 సంస్థల్లో ప్రభుత్వ వాటాల అమ్మకం
* తొలి విడుతలో రూ.14,500 కోట్ల సమీకరణ
* ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్‌రూ.36,915 కోట్లకు 51.1 శాతం వాటా
* పీఎఫ్‌సీ గూటికి ఆర్‌ఈసీ రూ.14,500 కోట్లకు 52.6 శాతం వాటా అమ్మకం

-శ్రీనివాస్