
ప్రధాని మోడీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం.. ఉచిత పథకాలను ఆయన అస్సలు ప్రకటించరు.. జనానికి ఉచితంగా భిక్ష వేయవద్దని.. వారికి బతకడానికి భరోసానివ్వాలని చెబుతాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల పరిశ్రమలను తీసుకొచ్చి గుజరాతీలకు ఉపాధి చూపించారు. వారిని స్వయంగా బతికేలా చేశారు. అందుకే గద్దెనెక్కగానే ఉపాధి హామీని తీసేయాలని చూశారు. ప్రజలను కూలీలుగా చూడడం ఆయనకు ఇష్టం ఉండదు. కానీ గుజరాత్ ఫార్ములాను దేశవ్యాప్తంగా విస్తరించాలని చూడడమే మోడీ అసలు వైఫల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గుజరాత్ లో ఉన్నది కొంతమందే.. కానీ దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు కల్పించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది పేదలకు ఉపాధి చూపించడం కష్టమే. ఉపాధి హామీ నమ్మి బతికిన వారిని పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించడం కష్టమే. అందుకే ఇటు మోడీ ఉపాధి వైపు మొగ్గకుండా అదే సమయంలో కేసీఆర్ లా ఉచిత పథకాలను ప్రకటించకుండా కానిచ్చేస్తున్నారు. ఇక్కడే దెబ్బతింటున్నారు..
నాడు నోట్ల రద్దు నుంచి నేటి పెట్రోల్, గ్యాస్ ధర పెంపు వరకూ మోడీ నిర్ణయాలన్నీ ప్రజలను బాధించేవే అనడంలో సందేహం లేదు. నోట్ల రద్దు వేళ.. పేదవారి నుంచి ధనవంతుల వరకూ బ్యాంకుల ముందు క్యూలు కట్టి ఎంత కష్టపడ్డారో చూశాం. జీఎస్టీతో జనం నడ్డివిరిచినప్పుడూ మౌనంగా ఉన్నాం.. ఇప్పుడు పెట్రోల్ రేట్లు రోజురోజుకు విపరీతంగా పెంచుతుంటే 100కు చేరువ చేస్తున్నా.. నిస్సహాయులై చూస్తున్నాం.. ఇప్పుడు గ్యాస్ ధరను మూడు నెలల్లోనే డబుల్ చేసి 1000కి చేరువ చేసినప్పుడు కూడా వామ్మో వాయ్యో అంటున్నారు.
ధరాఘాతంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా మోడీ స్పందించడం లేదు. కనికరించడం లేదు. జనాల బాధను అర్థం చేసుకోవడం లేదు. ఆయనకు ఎందుకింత ధైర్యం..? మళ్లీ గెలుస్తాడని ఎందుకంత నమ్మకం.. ప్రజల బాధలు పట్టని మోడీ వైఖరేంటి.? పెట్రోల్ నుంచి గ్యాస్ .. నిత్యవసరాలు ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్న మోడీ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నది అంతుచిక్కడం లేదు