పాపం సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్.. ఏపీలో బలపడాలని.. వచ్చేసారి అధికారంలోకి రావాలని ఎంతగానో తిరుగుతున్నారు. కాలికి బలపం కట్టుకొని ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ.. ప్చ్ ఏం చేస్తాం.. కేంద్రంలోని బీజేపీ ఏపీ విషయంలో చూపుతున్న వివక్ష చూశాక కమలం పార్టీ నేతల మోముల్లో నెత్తురు చుక్క ఉండడం లేదు. వారు జనాల్లో తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో లాగానే ఏపీలోనూ బలపడాలని చూస్తున్న ఏపీ బీజేపీ నేతలకు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం తీరు షరాఘాతంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వారి ఆశలపై బీజేపీ అధిష్టానం నీళ్లు చల్లుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంను తీసుకొని కేంద్రంలోని బీజీపీ ఏపీకి అన్యాయం చేసిందన్న వాదన ప్రజల్లోకి వెళ్లింది. బడ్జెట్ లో కేటాయింపులు ఏపీకి లేవు. అయినా అధికార వైసీపీ దీనిపై నోరత్తడం లేదు. ఏపీ బీజేపీకి అసలు వాయిస్ లేకుండా పోతోంది.
ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏపీలో కాకరేపుతోంది. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసినా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదట. ఢిల్లీలో సాగు చట్టాలపై మూడు నెలలుగా ఉద్యమిస్తున్నా రైతులను పట్టించుకోని కేంద్రం.. ఈ చిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని పట్టించుకుంటుందున్న నిరాశ ఏపీ వాసుల్లో నెలకొంది.
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఇబ్బందిగా మారింది. రాబోయే తిరుపతి పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ పరిణామం బీజేపీ-జనసేన కూటమికి శరాఘాతంగా మారింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చేకూరిన ప్రయోజనం శూన్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక హోదా నుంచి ప్యాకేజీ వరకు ఎలాంటి హామీలను నెరవేర్చలేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కంటే ఏడేళ్లుగా ఏపీకీి బీజేపీ చేసిన అన్యాయమే ఎక్కువగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్న అంచనాలు నెలకొంటున్నాయి.