తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ తరువాత ఆ హామీని విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారని యువత జోరుగా ప్రచారం చేశారు. ప్రతిపక్షాలు సైతం పలు సందర్భాల్లో జరిగిన ఎన్నికలు.. ఇతర కార్యక్రమాలలో ప్రధాన అస్త్రంగా దీన్ని వాడుకున్నాయి. అయితే గతేడాది దసరా సమయంలో దుబ్బాక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్షన్నర ఉద్యోగాలు యువతకు ఇచ్చామని.. మరో 50వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ హామీతో యువత సర్కారు కొలువులకు సిద్ధం అవుతోంది. పుస్తకాలతో కుస్తీ పడుతూ.. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు గురువారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయసు 61ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్ల పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ అమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయో పరిమితి 61ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కనీస పింఛను 50వేలు, గరిష్ట పింఛను 70వేలకు పెంచుతూ.. అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేశామని ప్రకటించారు.
మెరుగైన ఆరోగ్య ప్రమాణాలకోసం ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంచామని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు ఉందని తెలిపారు. పీఆర్సీ కమిషన్ పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వయోపరిమితి పెంచడం ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణం తీసుకున్నారని త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా 18 జిల్లాలలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ర్ట వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్, సిద్దిపేట లో డయాగ్నస్టిక్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.