
భారత్‌లో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఫలితంగా గ్యాస్ పంపిణీ దారులు గ్యాస్ హోమ్ డెలివరీని నిలిపివేస్తామని వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
గ్యాస్ పంపిణీ దారులు తమను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరడంతో పాటు తమకు వెంటనే కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని కోరుతున్నారు. తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు డిమాండ్ చేసింది. గ్యాస్ పంపిణీదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ నిలిచిపోనుంది.
ప్రభుత్వం స్పందించకపోతే హోమ్ డెలివరీ నిలిపేస్తామని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది పంపిణీదారులు వైరస్ బారిన పడ్డారని గ్యాస్ పంపిణీదారులు చెబుతున్నారు. గ్యాస్ పంపిణీదారులు ఇంటింటికీ వెళ్లి గ్యాస్ ను పంపిణీ చేయాల్సి ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.
ప్రభుత్వం వీరిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు కరోనా వల్ల ప్రజలు కష్టాలు పడుతున్న తరుణంలో హోమ్ సిలిండర్ డెలివరీ ఆగిపోతే ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.