
తెలంగాణలో నియంత్రిత సాగు విధానం తెచ్చి ఈ పంటలే వేయాలని మొన్నటి వరకు సీఎం కేసీఆర్ రైతులకు ఆంక్షలు పెట్టారు. సన్నరకం వరి వేయాలని.. మొక్కజొన్న తగ్గించాలని.. పప్పు ధాన్యాలు పెంచాలంటూ తెలంగాణ రైతుల ముందరి కాళ్లకు బంధాలు వేశారు. దీంతో ఈసారి కేసీఆర్ చెప్పినట్టే తెలంగాణలో రైతాంగం పంటలు వేసింది. అయితే దీనిపై రైతుల్లో మేధావులు, రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు ఇటీవల ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగిలాయి.
Also Read: రేవంత్ ను కలిసిన రియల్టరు.. ఏం జరుగుతోంది?
తెలంగాణ రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఆలోచించకుండా తాను చెప్పిందే పండించాలన్న కేసీఆర్ తీరుపై రైతుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వారి నేల స్వభావం , పంటలు ఏం వేయాలో రైతులకే బాగా తెలుసు. అలాంటిది కేసీఆర్ నియంత్రించడం వ్యతిరేకతను పెంచింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని కేసీఆర్ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తెలంగాణలో రైతులు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం ఎలాంటి మర్గదర్శకాలు జారీ చేయదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ పంటలు వేయాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించింది.
మండల కేంద్రాల్లో రైతు వేదికల్లో రైతులు, అధికారులు సమావేశమై తమ భూముల్లో ఏ పంటలు మేలో వాటిని ఎంపిక చేసుకొని వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మార్కెట్ లో డిమాండ్ ను బట్టి ఏ పంట వేయాలో చర్చించుకోవాలని పేర్కొంది. ఇక పంట ఇష్టమున్నచోట ధర వచ్చిన చోట అమ్ముకోవచ్చని.. మద్దతు ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Also Read: ప్రగతి భవన్ ముట్టడి.. ఉద్రిక్తం..!
ఇక వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. పంటల కొనుగోళ్లతో ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే గ్రామాల నుంచి పంట కొనుగోళ్ల కేంద్రాలను తొలగించాలన్న నిర్ణయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎత్తివేస్తే దళారులకు తక్కువకు అమ్ముకొని నష్టపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ నిర్ణయాలపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్