
ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనం వీడారు. తెలంగాణ సీఎం కుర్చీ మార్పుపై స్పందించారు. తాను తప్పుకొని కొడుకు, మంత్రి అయిన కేటీఆర్ ను సీఎం చేస్తారన్న ఊహాగానాలపై అధికారికంగా స్పందించారు.
తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటల పాటు ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.
ముఖ్యంగా తెలంగాణ సీఎం కుర్చీ మార్పు అంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. మరో పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎందుకలా ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని వ్యాక్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని చురకలంటించారు.
ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు చేయాలని.. ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు పూర్తి చేసి ఘనంగా పార్టీ పండుగను నిర్వహిద్దామని శ్రేణులకు పిలుపునిచ్చాడు.
జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజే ప్రకటిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. కార్పొరేటర్లు బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గన విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.