
సీఎం కేసీఆర్ చెకింగ్ ల బాట పట్టారు. నిన్న తెలంగాణ సీఎంవో పీఆర్వోగా ఉన్న విజయ్ కుమార్ ను తొలగించిన కేసీఆర్ తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ విజయ్ కుమార్ ను అర్ధాంతరంగా సీఎం పీఆర్వోగా తొలగించడం ఇప్పటికీ తెలంగాణ జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై ఆరోపణలు వచ్చాయని అందుకే తీసేశారని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ అటు సీఎంవో కానీ.. ఇటు విజయ్ కుమార్ కానీ తెలుపడం లేదు.
ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం సడెన్ గా కేసీఆర్ యాదాద్రి బాటపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునర్మిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు.
గత పర్యటన సందర్భంగా చేసిన సూచనల మేరకు పనులు జరిగాయా? ఇంకా పూర్తి కావాల్సి ఉన్న పనుల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
యాదాద్రి పనులను రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ ఇప్పటికే దీనికి 850 కోట్ల వరకు ఖర్చయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా కేసీఆర్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వ్యవస్థలోని లోటుపాట్లను సరిచేయడానికి నడుం బిగించినట్లు తెలంగాణ అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే సీఎంవోలో తీసివేతలు.. యాదాద్రి పర్యటనలు పెట్టుకున్నాడని అంటున్నారు.